Saturday, 6 June 2020

డీపీఆర్‌లు ఇవ్వండి- తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు

Jun 5 2020 @ 03:12AMహోంతెలంగాణ

డీపీఆర్‌లు ఇవ్వండి కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
ప్రభుత్వాలతో మాట్లాడి చెప్తామన్న అధికార్లు
పట్టిసీమలో 45 టీఎంసీల వాటా ఇవ్వాలి
సాగర్‌లోని 50 టీఎంసీలు క్యారీ ఓవరే
పోతిరెడ్డిపాడుతో 175 టీఎంసీలు తోడారు
పోతిరెడ్డిపాడు విస్తరణ,
రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయాలి: తెలంగాణ
మా కోటా నీటి వాడకానికే ఆ ప్రాజెక్టులు: ఏపీ
తెలంగాణ వాదనలో మోదీ ఎన్నికల ప్రసంగం
ఈ ఏడు కూడా పాత పద్ధతినే కేటాయింపులు


హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జల సౌధలో గురువారం ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM




తెలంగాణ తరఫున సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం ఇంజనీర్లు, ఏపీ నుంచి సాగు నీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత డీపీఆర్‌లు సమర్పిస్తామని అధికారులు బోర్డుకు తెలిపారు.



వాటిని ఆపేయండి.. కోటా మార్చండి

తొలుత తెలంగాణ అధికారులు తమ వాదన వినిపించారు. ప్రత్యేక ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ ప్రాజెక్టులకు నష్టం కలిగించే, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న కోటా (తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు)లో మార్పులు చేయాలని కోరారు. తాగు నీటి కోసం కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నదాంట్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న 50 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని, వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.



పోతిరెడ్డిపాడు నుంచి ఏడాదికి 101 టీఎంసీలను మాత్రమే తరలించాల్సి ఉండగా.. ఏపీ గతేడాది 175 టీఎంసీలను తీసుకుందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డిపై ఏపీ ఫిర్యాదును ప్రస్తావిస్తూ, వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, దీనికి సాక్ష్యంగా 2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీచేసిన ప్రసంగాన్ని వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి పాత ప్రాజెక్టేనని చెప్పడమే తమ ఉద్దేశమని తెలంగాణ అధికారులు వివరించారు.



మా ప్రాజెక్టులనూ రీ డిజైన్లుగానే చూడండి

కృష్ణా బేసిన్‌లో తమ కోటా నీటి వినియోగానికే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతలను చేపడతున్నట్లు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు రీ డిజైన్‌ అయినప్పుడు, తమవాటినీ అలాగే భావించాలన్నారు. రాష్ట్ర విభజన 2014లో జరిగినందున.. తర్వాత జారీ చేసిన జీవోలన్నీ కొత్త ప్రాజెక్టుల కోసమనే పరిగణించాలని కోరారు. ఈ లెక్కన పాలమూరు-రంగారెడ్డి, డిండి కొత్త ప్రాజెక్టులేనని అన్నారు. అనుమతులు వచ్చేవరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని బోర్డు సూచించింది.



బోర్డు తీసుకున్న నిర్ణయాలు..

గత ఏడాదిలానే బేసిన్‌ నీటిని రెండు రాష్ట్రాలు 66: 34 శాతం నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి. నీటి లెక్కలు తేలేవరకు వాడకం ఇదే పద్ధతిన సాగాలి.
టెలీమెట్రీ యంత్రాల రెండో దశ ఏర్పాటును కచ్చితంగా అమలు చేయాలి.
శ్రీశైలం జల విద్యుత్‌ను చెరిసగం వాడుకోవాలి.
బేసిన్‌లో మిగులు జలాలను సమానంగా వాడుకోవాలి. 2019-20లో ఉపయోగించుకున్న మిగులు నీటి లెక్కల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలి.
సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో నీటి నష్టంపై ఇప్పటికే నియమించిన కమిటీ క్షేత్ర పరిశీలన చేయాలి.
తాగునీటికి అవసరాలకు కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై కేంద్ర జల సంఘానిదే తుది నిర్ణయం.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ఉన్న తెలంగాణ నీటి వాటాను క్యారీ ఓవర్‌గా పరిగణించడంపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకుని, బోర్డు మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి వస్తుంది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న గోదావరి నీటిలో తెలంగాణ వాటాను తేల్చే అంశం, కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలింపుపై నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అప్పగింత.


నేడు గోదావరి బోర్డు సమావేశం

గోదావరి బోర్డు శుక్రవారం సమావేశం కానుంది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈ అంశాలపై చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

No comments:

Post a Comment