Wednesday, 18 June 2025

CM Revanth Reddy on Banakacharla

CM Revanth Reddy on Banakacharla  

 బనకచర్ల పాపం కేసిఆర్ దే

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:49 AM

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ పదేళ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్లం. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్‌, హరీశ్‌ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆర్‌ కాదా? ఇదే అవకాశంగా తీసుకుని కృష్ణా బేసిన్‌ కొల్లగొట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్‌కు వచ్చారు. కేసీఆర్‌.. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటి?


తెలంగాణకు తీరని ద్రోహం చేశారు

2016, 2019లో చంద్రబాబు, జగన్‌తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గం సుగమం చేశారు

రాయలసీమను రతనాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీనిచ్చారు

ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడట్లేదంటూ మాపై బురద!

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, హరీశ్‌రావుదే

తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి

మోదీ వద్ద పలుకుబడి ఉన్నా బాబుకు అనుమతులు భ్రమే

‘గోదావరి-బనకచర్ల’పై మీడియాతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు బుఽధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌.. భేటీ ముగిశాక సచివాలయంలోనే ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే.. ఆ విషయంలో శిక్షించి, ఉరి తీయాల్సింది కేసీఆర్‌, హరీశ్‌రావునేనని ధ్వజమెత్తారు. వారు ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదని.. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో సర్వపాపాలు చేసి, పాపాల భైరవులుగా మారి రాష్ట్రానికి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. వారే ఇప్పుడు.. ‘బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ మాట్లాడట్లేదు’ అంటూ తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వెంటనే తాము కేంద్ర మంత్రిని కలిసి.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు అన్ని వివరాలనూ తెలిపామని సీఎం చెప్పారు. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రితోనూ చర్చించామని.. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ లేఖలు రాశారని గుర్తుచేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించడం వెనుక రాజకీయ ప్రేరేపిత అంశాలేవీ లేవన్న సీఎం.. భవిష్యత్‌ కార్యాచరణ, ప్రణాళికలపై ప్రతిపక్షాలను సూచనలు అడిగినట్టు తెలిపారు. రాజకీయ అంశాలకు అవకాశం ఇవ్వకూడదని భావించే.. ఈ భేటీకి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించామన్నారు.

ఆ సమావేశంలో చర్చించిన పలు విషయాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జలశక్తిభవన్‌, న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఆందులో అప్పటి సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఆ సమావేశంలో గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణాలపై, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. 8 పేజీలతో సమావేశం వివరాలను నమోదుచేశారు. అందులో 6వ పేజీలోని రెండో పేరాలో పేర్కొన్న దాని ప్రకారం ‘‘గోదావరి జలాల్లో 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో నిర్మించుకునే ప్రాజెక్టులకు 1000 టీఎంసీల అవసరం ఉంది. గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చ’’ని పేర్కొన్నారు. అంటే గోదావరిలో 3వేల టీఎంసీలు వృధా అవుతున్నాయి, వాటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించి తద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే విషయానికి పునాది పడింది అప్పుడే. ఇది అధికారిక సమావేశంలో చెప్పిన విషయం. ఈ విషయం అప్పటి మంత్రి హరీశ్‌కు తెలియదనడం కరెక్ట్‌కాదు. ఈ వివరాలను హరీశ్‌కు పంపుతా’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత.. కేసీఆర్‌, చంద్రబాబుల మధ్య ఉన్న వైరాలు, అంతరాల వల్ల అది కార్యరూపం దాల్చలేదన్నారు. 2019లో ఏపీలో జగన్‌ సీఎం అయ్యాక.. తెలంగాణలో కేసీఆర్‌ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. వారిద్దరూ 2019 జూన్‌ 28, ఆగస్టు, సెప్టెంబరు, మళ్లీ ఆ తరువాత ఏడాది ఆగస్టు నెలల్లో.. మొత్తం నాలుగు సార్లు భేటీ అయ్యారని, ఆ సమావేశాల్లోనే జలబంధం ఏర్పడిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అప్పట్లో కేసీఆర్‌ సొంత పత్రికలో ప్రచురించిన పలు కథనాలను సీఎం విలేకరుల సమావేశంలో చూపించారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం ద్వారా ‘నష్టం తక్కువ లాభం ఎక్కువ’ శీర్షికన ప్రచురితమైన కథనాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

కేసీఆర్‌ వలనే బనకచర్ల..

ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్‌ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకెళ్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. జగన్‌ సీఎం అయ్యాక.. అప్పటి మంత్రి రోజా ఇంటిదగ్గర కేసీఆర్‌ ఏం మాట్లాడారో కూడా అందరూ చూశారని పేర్కొన్నారు. ‘‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. కలిసి పనిచేస్తాం. సమర్థమైన సీఎంగా జగన్‌ ఉన్నారు. నేను పెద్దన్నగా పూర్తిగా సహకరిస్తా. రాయలసీమను రతనాలసీమగా చేస్తా’’ అని కేసీఆర్‌ అప్పుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. శాసనసభలో, వివిధ సందర్భాల్లో.. గోదావరి జలాలను పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి, ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి, ప్రోత్సహించిందే కేసీఆర్‌, హరీశ్‌ అని సీఎం దుయ్యబట్టారు. చంద్రబాబు గోదావరి జలాలను బనకచర్ల వరకూ తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించారని.. పరోక్షంగా మరో 100 టీఎంసీలను కలిపి మొత్తం 300 టీఎంసీల ప్రాజెక్టుకు సివిల్‌ వర్క్‌లు పూర్తి చేస్తున్నారని రేవంత్‌ తెలిపారు. గతంలో చర్చల సందర్భంగా కేసీఆర్‌.. 400 టీఎంసీల తరలింపునకు ప్రతిపాదన ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ప్రతిపాదనల ప్రకారమే చంద్రబాబు వ్యవహరిస్తే.. మొత్తం 400 టీఎంసీలను తీసుకెళ్లినా ఆఽశ్చర్యం లేదన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు గురించి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడగానే వెంటనే సాగునీటి మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్న తమపై హరీశ్‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అలా అనుకుంటే పొరపాటే..

‘‘చంద్రబాబు నాయుడుకు సూచన చేస్తున్నా.. కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే పొరపాటే’’ అని సీఎం రేవంత్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమకు భేషజాలు లేవని.. అందరినీ కలిసి సమస్యను వివరిస్తామని.. అప్పటికీ న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. ‘‘గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే.. 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలి’’ అన్నారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక.. ఏపీ ఏ నీరు వాడుకున్నా తమకేమీ అభ్యంతరం ఉండదన్నారు. ‘‘చంద్రబాబు దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు. కృష్ణా గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక.. మిగిలిన నీరు మీరు ఎలాగైనా వాడుకోండి’’ అని వ్యాఖ్యానించారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలను వివరిస్తామన్న సీఎం.. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘అఖిల పక్ష భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పిలిస్తే సమయం లేదన్న ఆయన.. బుధవారం సాయంత్రం జలశక్తి మంత్రిని ఎలా కలిశారో.. ఎందుకు ముందే కలిశారో.. ఆ రహస్యాలను ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ‘‘రేపు మేం కలుస్తామని తెలిసి, ఇవాళ వెళ్లి కలవడం వెనుక ఏం కుట్ర ఉందో? అఖిలపక్ష సమావేశానికి రాకుండా ముందుగానే జలశక్తి మంత్రిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ధ్వజమెత్తారు. చట్టప్రకారం గోదావరి జలాల వినియోగంలో వివాదాలను పరిష్కరించుకునేందుకు బోర్డు ఉందని, సీఎం స్థాయి వరకూ కమిటీలు ఉన్నాయని.. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. అలాంటి బోర్డుకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండానే.. కేంద్రంలో పలుకుబడి ఉందని నేరుగా పై నుంచి కిందకు అనుమతులు తీసుకొస్తామంటే వీలుకాదని వ్యాఖ్యానించారు. ‘‘బోర్డు అనుమతించాక. పర్యావరణ శాఖ మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలవాలి. అలా కాకుండా పైనుంచే కిందకు అనుమతులు తెస్తామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.. మేం అభ్యంతరాలను వ్యక్తం చేయడం వల్లనే ఇవాళ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడుతామని సీఎం రేవంత్‌ తేల్చిచెప్పారు. ఇందులో ఎలాంటి శషభిషలూ లేవన్నారు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ప్రస్తుతం తాము మొదటి అంకంలో ఉన్నామన్నారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలుస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ముందుగానే న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. కోర్టు వినదన్నారు. కాగా.. గత పాలనలో పదేళ్ల కాలంలో 96 క్యాబినెట్‌ సమావేశాలు జరిగాయని.. కానీ, ఒక్క భేటీలో కూడా కాళేశ్వరం అనుమతులపై చర్చ జరగలేదని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో అంచనాలు పెంచుకునేందుకు మాత్రమే అనుమతులు తీసుకోవడంపై చర్చించారని తెలిపారు.

తల ఎక్కడ పెట్టుకుంటావ్‌ హరీశ్‌..

హరీశ్‌రావుకు వయసు మీద పడిందని, ఆయన ఇంకా చిన్నపిల్లవాడు కాదని.. ఇకనైనా చిల్లర పనులు మానుకోవాలని సీఎం రేవంత్‌ హితవు పలికారు. ప్రాజెక్టుల విషయంలో అన్ని అంశాలనూ తాము బహిర్గతం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు హరీశ్‌ తన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘‘జీవితాంతం, కుటుంబం అంతా అబద్ధాలు చెప్పుకొంటూనే బ్రతుకుతారా?’’ అని నిలదీశారు. ‘‘కడుపునొప్పికి మందు ఉంది కానీ.. హరీశ్‌రావు అసూయకు మందు లేదు.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు కాళేశ్వరం అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ, నిజాలు నిప్పులాంటివి. అన్నీ బయటకు వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి అవయవదానం చేసి.. ఆ పార్టీకి చెందిన 8 మంది అభ్యర్థులు గెలిచేలా బీఆర్‌ఎస్‌ పని చేసిందని.. అందుకే, హరీశ్‌ అబద్ధాలు చెబుతుంటే.. కిషన్‌రెడ్డి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని రేవంత్‌ విమర్శించారు. బుధవారం భేటీకి.. దామోదర్‌రావు, సురే్‌షరెడ్డి రాలేదని, అమాయకుడు వద్దిరాజు రవిచంద్రని పంపారని అన్నారు. ఆయన కూడా తనకు ఇచ్చిన కాగితంలో ఉన్నవాటినే చదివారని.. తాను కొన్ని విషయాలను లేవనెత్తగానే వెళ్లిపోయారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, ప్రమాదంలో మరణించిన పేదలకు పంచిపెడతారేమోనని 18 నెలల నుంచి చూస్తున్నానని.. కానీ పదిపైసలు కూడా ఇవ్వలేదన్నారు. కాగా.. రాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంపై కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను సీఎం రేవంత్‌ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు.

ఆ సూత్రం బనకచర్లకూ వర్తిస్తుంది

ఏపీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా 45 టీఎంసీల కృష్ణా జలాలు మనకు రావాల్సి ఉంటుందని.. అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. అదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకూ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి-బనకచర్లను 200 టీఎంసీల తరలింపు కోసంచేపడుతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలు 300టీఎంసీలకు సరిపడా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో 120 రోజుల పాటు నీటిని తరలించడానికి అవసరమైన ఏరాట్లు చేస్తున్నారని తెలిపారు. గోదావరి జలాల తరలింపుపై కేసీఆర్‌ గతంలో అన్న మాటల గురించి సీఎం ప్రస్తావించినప్పుడు.. బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని.. ‘దీనిపై రాజకీయం వద్దు’ అన్నారు. దీనికి సీఎం.. తాను రాజకీయ అంశాలు ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు. గోదావరి జలాలను శ్రీశైలానికి, అక్కడి నుంచి రాయలసీమకు అందించాలనేదే కేసీఆర్‌ ఉద్దేశమని అన్నారు. దాంతో వద్దిరాజు సమావేశం నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. ఆయన బయటకు వెళుతుండగా.. మిగిలిన ఎంపీలు సముదాయించడానికి ప్రయత్నించారు. అప్పుడు సీఎం జోక్యం చేసుకుని.. ‘వెళ్లనివ్వండి... ఆయన ఇబ్బందులు ఆయనవి’ అని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తుతామన్నారు. గోదావరి -బనకచర్లకు వ్యతిరేకంగా ఎంపీలంతా కలిసి ఒక తీర్మానం చేస్తే, దాన్ని కేంద్రానికి అందిద్దామని సీఎం ప్రతిపాదించారు. రాష్ట్రం ఏర్పడ్డాకా బేసిన్‌ పారామీటర్‌, బేసిన్‌ వెంట నివసిస్తున్న జనాభా ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811టీఎంసీల్లో 555 టీఎంసీలను తెలంగాణకు కోరాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని.. 2021 దాకా ఈ ఒప్పందం కొనసాగిందని సీఎం మండిపడ్డారు. గోదావరి-బనకచర్లకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ముందుకెళతామని సీఎం ప్రకటించారు. ఈ సమయంలో డీకే అరుణ జోక్యం చేసుకొని... ‘ఎందుకు తమ్ముడూ (సీఎంనుద్దేశించి) ఏపీ వాళ్లు అంత స్పీడ్‌.. స్పీడ్‌గా పోతున్నరు’అని ప్రశ్నించగా.. ‘ఏపీ వాళ్లు అంతే అక్కా.. వాళ్లు ఉదయం 5 గంటలకు లేస్తే... మనం 11కు లేస్తాం’ అని సీఎం సరాదాగా జవాబు చెప్పారు. దాంతోసభ్యులంతా గట్టిగా నవ్వారు.


నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి, ఫిర్యాదు చేయడానికి.. సీఎం రేవంత్‌ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి ఉత్తమ్‌ బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి, గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశమై.. మెట్రో విస్తరణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం.. ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలవున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 03:49 AM

Friday, 13 June 2025

Godavari - Cauveri (GC) Link Project

 గోదావరి-కావేరీ అనుసంధానం సాధ్యమేనా?

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:42 AM

 

24న హైదరాబాద్‌లో నదుల అనుసంధాన సంప్రదింపుల కమిటీ భేటీ

 

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి - కావేరి అనుసంధాన (జీసీ లింక్‌) ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 11:30 గంటలకు హైదరాబాద్‌లో జాతీయ నీటిఅభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) సంప్రదింపుల కమిటీ జరగనున్నది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు. కేంద్రం ఇప్పటి వరకూ పోలవరం నుంచి గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును ఒప్పుకోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం న్యూఢిల్లీలో జరిగిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకొచ్చిందని ఆరా తీసినట్లు సమాచారం.

 

ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలని పట్టుబట్టిన ఏపీ.. తాజాగా రూట్‌ మార్చి గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నిర్మించే 173 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నుంచే ‘బొల్లాపల్లి-కావేరీ అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. పోలవరం విస్తరణలో భాగంగా రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు కొత్తగా గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది.

 

అంతటితో ఆగక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46(2), 46(3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట గోదావరి-బనకచర్ల అనుసంధానానికి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరుతున్నది. బొల్లాపల్లి - కావేరీ అనుసంధానానికి ఒప్పుకుంటే మాత్రం.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరించాల్సి ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

గోదావరి - కావేరి నదుల అనుసంధానం

 

సందర్భం

గోదావరి - కావేరి నదుల అనుసంధానం మరోసారి తెరమీదికి వచ్చింది.

ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను  తెలుసుకోవడానికి జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA) జూన్ 24న హైదరాబాద్ లో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.

 

ఈ సమావేశానికి కేంద్ర జల వనరుల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

 

ప్రశ్నలు :

1.            గోదావరి - కావేరి అనుసంధానం (GC Link) ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం వుందా?

 

2.            ఈ ప్రాజెక్టువల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

 

3.            ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?

 

4.            తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటీ?

 

5.            పోలవరం నుండి గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుండేది. ఇప్పుడు బొల్లాపల్లి నుండి కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరుతోంది. ఈ మార్పుకు కారణం ఏమిటీ?

 

6.            గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటీ?

 

7.            ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 46 (2), 46 (3) సెక్షన్ల కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాలి. అలా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే అవకాశం వుందా?

 

8.            బచావత్ ట్రిబ్యూనల్ నాటికి గోదావరి నదిలో మిగులు నికర జలాలున్నాయి. ఇప్పుడూ అదే పరిస్థితివుందా?

 

9.            గోదావరి నుండి కావేరి బేసిన్ కు నికరజలాలను కేటాయిస్తారా?

 

10.       అలా చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సమస్యలు ఏమిటీ?