Monday, 7 July 2025

Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా

 Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:34 AM


పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.


Polavaram Banakacharla Project: సీమ జలసమృద్ధికి బనకచర్ల భరోసా


పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పది సంవత్సరాలలో మూడేళ్ళు మాత్రం కృష్ణాజలాలు పారటానికి అవకాశమున్న హంద్రీ–నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. కనుక గోదావరి జలాల మళ్ళింపు ఉత్తమ మార్గం.


Video Player is loading.This is a modal window.The media could not be loaded, either because the server or network failed or because the format is not supported.Unibots.com

ABN ఛానల్ ఫాలో అవ్వండి


పోలవరం-బనకచర్ల పథకంపై గత కొద్ది రోజులుగా రాజకీయ ధర్మోపన్యాసాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. చట్టబద్ధత లేని, స్వయంప్రకటిత కేటాయింపుగా 1450 టీఎంసీల గోదావరి జలాలలో తమ వాటా 1000 టీఎంసీలని తెలంగాణ చెప్పుకుంటూనే, వరద జలాలతో 80 నుంచి 90 రోజులలో పంపింగ్ జరిగే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం కలుగుతుందని చాటించుకుంటున్నారు. 2016లో జరిగిన గోదావరి జల యాజమాన్య బోర్డు మీటింగులో తెలంగాణ ప్రతినిధులు గోదావరి జలాలు ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరగలేదనీ, రాష్ట్రాల మధ్య పరస్పర ఒడంబడిక ద్వారా గానీ, ట్రైబ్యునల్ నిర్ణయం ద్వారా గానీ కేటాయింపులు జరగాలని చెప్పారు. అయితే ఈ రెండూ జరగలేదు. కానీ తమ వాటా 1000 టీఎంసీలనీ, (ఇంతకు ముందు ప్రభుత్వం 945 టీఎంసీలుగా చెప్పింది) ఆంధ్రప్రదేశ్ వరద జలాలు కూడా ముట్టుకోవడానికి వీలులేదనీ దబాయిస్తున్నారు. ఇటువంటి దబాయింపులు గత పదకొండేళ్ళుగా వింటూనే ఉన్నాం. గోదావరి ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఏ రాష్ట్రమయినా వారి వాటా జలాలను ఇంకొక బేసిన్‌కి తరలించుకోవచ్చు. చట్టబద్ధమయిన కేటాయింపులు లేని నికర జలాల ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టవచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం వరద జలాలతో కూడా ప్రాజెక్టులు నిర్మించకూడదు. కొందరు తెలంగాణ నాయకులయితే మళ్లించిన గోదావరి జలాలకు సమానంగా వారికి కృష్ణా జలాలు సమర్పించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు.




తెలంగాణతో బనకచర్ల ప్రాజెక్టు వివాదాల్ని పక్కన పెట్టి, ఆ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి పరిశీలిద్దాం. రాయలసీమ ప్రాజెక్టులయిన హంద్రీ–నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలిగొండలకు గోదావరి నీటి సరఫరాకు ఉద్దేశించిన పథకం పోలవరం–బనకచర్ల. ఈ ప్రాజెక్టులు బచావత్ ట్రైబ్యునల్ కల్పించిన మిగులు జలాల వినియోగానికి ఉద్దేశించినవి. కానీ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్–2 తీర్పు తరువాత ఈ వెసులుబాటుకు ఆటంకం కలిగింది. ఈ తీర్పు ఇంతవరకు అమలులోకి రానందున పాత పద్ధతే కొనసాగుతోంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్–1 తీర్పులో ఒక రాష్ట్రం తమ వాటాని రాష్ట్రంలో ఎక్కడయినా వాడుకోవటానికి వీలు కల్పించింది.



విభజన చట్టం–2014లో షెడ్యూల్ పదకొండు, ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న నీటి వినియోగం కొనసాగుతుందని చెప్పింది. ఇప్పుడు నడుస్తున్న ట్రైబ్యునల్–2 ఎక్స్‌టెన్షన్ ఇరు రాష్ట్రాల మధ్య వారి వారి ప్రాజెక్టులకి నిర్దిష్ట కేటాయింపు లేకపోతే, ఆ పరిమాణాలని కూడా నిర్ణయించి, ఆపరేషన్ ప్రొటోకాల్ నిశ్చయించాల్సి ఉంది. 2013లో ఇదే ట్రైబ్యునల్–2 ఈ ప్రాజెక్టులకి కేటాయింపులు చేయకపోగా, సగటు నీటి లభ్యత వరకు (2578 టీఎంసీలు) అన్ని రాష్ట్రాలకి కేటాయింపులు చేసేసింది. కనుక ప్రస్తుత ట్రైబ్యునల్–2 ఎక్స్‌టెన్షన్ ఒకవేళ చేస్తే ఈ 2578 టీఎంసీలకు అధికంగా లభ్యమయ్యే నీటిని వాడుకోవచ్చు అని అనవచ్చేమో? లేదా అసలు వీలు కాదని చెప్పినా చెప్పవచ్చు. ఈ 2578 టీఎంసీల కంటే అధికంగా లభ్యమయ్యే నీటికి తెలంగాణ కూడా పోటీదారు(విభజన చట్టం షెడ్యూల్ 11లో కల్వకుర్తి, నెట్టెంపాడు కూడా ఉన్నాయి). అంతేకాదు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ అన్నీ ఆయా రాష్ట్రాల నిర్వహణలో ఉన్నాయి. ముందు ముందు ఇవి కృష్ణా యాజమాన్య బోర్డు ఆధీనంలోకి వెడతాయి. అప్పుడు, ఇప్పుడున్న వెసులుబాటు కూడా ఉండదు. పైగా మిగులు నీటిని (2578 టీఎంసీల కంటే ఎక్కువగా లభ్యమయ్యే) ఆరు ప్రాజెక్టులకి పంచాలి. ఒకవేళ ట్రైబ్యునల్ ప్రాధాన్యక్రమం నిర్ణయించకపోతే, అనుక్షణం జగడం జరుగుతుంది. వరద ఎంత కాలం లభ్యమవుతుందో కూడా ఒక సందిగ్ధమే కనుక, రాయలసీమ ప్రాజెక్టులయిన హంద్రి–నీవా, గాలేరు–నగరిలకు నీటి సరఫరా ఒక అనిశ్చితిగా ఉంటుంది. తెలుగు గంగ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్–2 సరాసరి నీటి లభ్యత ఆధారంగా 25 టీఎంసీలు కేటాయించినా (ప్రాజెక్టు రూపకల్పన 29 టీఎంసీలకి జరిగింది), ఈ కాలువ ద్వారా చిత్తూరు జిల్లాలో అదనపు ఆయకట్టుకు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. పది సంవత్సరాలలో మూడేళ్ళు మాత్రం కృష్ణాజలాలు పారటానికి అవకాశమున్న ఈ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. కనుక గోదావరి జలాల మళ్ళింపు ఉత్తమ మార్గం. ఒకవేళ మళ్ళించకపోతే నష్టపోయేది రాయలసీమే, అదీగాక, ప్రస్తుతం రాష్ట్రం మొత్తం వాటాలో కొంత నీటిని ఎక్కడయినా వాడుకునే వెసులుబాటు కూడా రద్దవుతుంది. ఎందుకంటే ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ణయించినప్పుడు, వేరే చోట ఆ నీటిని వాడలేరు, అప్పుడు బోర్డు చేతులు కూడా కట్టివేసినట్టు అవుతుంది. సోమశిల, కండలేరు రిజర్వాయర్లను గత కొద్ది సంవత్సరాలుగా కృష్ణా జలాలతో గండికోట ప్రాజెక్టు ద్వారా అదనంగా నింపుతున్నారు. గోదావరి జలాల మళ్ళింపు తర్వాత కూడా ఆ జలాలతోనే వాటిని బనకచర్ల–గండికోట ద్వారానే నింపటం ఉత్తమం.



పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుని తెలంగాణ వారి కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చి అవినీతి జరగవచ్చని సంకోచం వెలిబుచ్చుతున్నారు. అవినీతి అంశం వదిలేస్తే– పెట్టుబడి పరిమాణం, చేపట్టవలసిన నిర్మాణ స్థూలత్వం గమనిస్తే, బహుశ ఆ పోలిక సమర్థనీయం కావచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మితమైన టన్నెళ్ళు, భూగర్భ పంపుహౌస్‌లు, కాలువలు, చెరువులు గణనీయంగా ప్రశంసించదగినవే. బారేజ్‌లలో తప్పిదాలు జరిగాయి కాని, సమగ్రంగా అది ఒక మెగా ప్రాజెక్టు. బారేజ్‌లు దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నా, తక్కువ రోజుల పంపింగ్‌తో వరదల సమయంలో పాక్షిక లాభాలు పొందవచ్చు. దశాబ్దాల క్రితంలా కాకుండా ఇప్పుడు ప్రాజెక్టులన్నీ మెగా పరిమాణంలోనే ఉంటున్నాయి. జాతీయ రహదారుల విస్తరణ, కొత్త బాటల నిర్మాణాలు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వంటివి తలచుకుంటే సాధించగలమని చెబుతున్నాయి. సరైన సంకల్పంతో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు కూడా నిర్ణీత సమయంలో అలా నిర్మించవచ్చు.


- కురుమద్దాలి వెంకటసుబ్బారావు


విశ్రాంత చీఫ్ ఇంజనీర్


Updated Date - Jul 08 , 2025 | 01:34 AM

No comments:

Post a Comment