Tuesday, 22 June 2021

Krishna waters - AP

 మొత్తంగా కృష్ణాజలాలకే ఎసరు పెట్టారు!

Jun 23 2021


సాగునీటి రంగంలో తాను అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఏమిటో తెలిసి వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. కేంద్ర ప్రభుత్వం తోక కోసి సున్నం పెడుతున్నా గట్టిగా అడగ లేకున్నది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యక్ష పోరాటానికి సవాలు విసిరినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తదనుగుణమైన చర్యలు ఏమీ కనించడం లేదు. ఈ అంశంలో కేసీఆర్ ద్విముఖ పోరాటానికి తెర లేపారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ ఈ పాటికే వ్యూహాత్మకంగా పైచేయి సంపాదించారు. ఒకవైపు అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునలును గాని లేదా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు బాధ్యత అప్పగించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ వద్ద మాట తీసుకున్నారు. ఇదే జరిగితే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టియంసిలు భవిష్యత్తు గాలిలో దీపమే. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్‍తో బస్తీమే సవాల్ అంటూ పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను మెతక వైఖరి అవలంబిస్తూ సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రయోజనాలను బలి పెడుతున్నారు. 




గత ఏడాది అక్టోబరులో అపెక్స్ కౌన్సిలు సమావేశం జరిగింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకుంటే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ నదీ జలాల పంపిణీని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు నివేదించుతానని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి షెకావత్ తెలంగాణ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణ సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని కొత్తగా ట్రిబ్యునల్‍గాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు గాని అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు నివేదించమని కోరింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించారు? అంతేకాదు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలులో లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవిగా భావింపబడుతున్నాయి. 11 షెడ్యూలులో లేకున్నా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి దిండి తదితర ప్రాజెక్టుల గురించి ఏపీ ముఖ్యమంత్రి సమావేశంలో గట్టిగా ఎందుకు నిలదీయ లేదు? పైగా కేంద్ర జల సంఘం వద్ద సాంకేతిక అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవి అని కేంద్ర మంత్రి నిర్వచనం ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదించడంతో ఏపీ పలు పాత ప్రాజెక్టులకు సమస్యలు వచ్చిపడ్డాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెర మీదకు తెచ్చింది. ఒక్క పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనుల విషయంలో మౌనం పాటించినందున ఇప్పుడు గోడ దెబ్బ చెంప దెబ్బ తినవలసి వస్తోంది.




వాస్తవంలో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణ జలాల కేటాయింపులపై వివాదం లేదు. చట్టబద్ధత గల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉంది. ఎవరి వాటా ఎంతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు విధించిన స్టే మేరకు అమలులోలేని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులోనూ స్పష్టంగా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రాంతం తరపున సరైన వాదన వినిపించ లేదనేది తెలంగాణ ఫిర్యాదు. ఇందుకు న్యాయపరంగా ఎలాంటి ఆధారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగడం కేంద్రమంత్రి సరే అనడం మన ముఖ్యమంత్రి మౌనం దాల్చడంతో నేడు అసలుకే మోసం వస్తోంది. 




సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీలో ఉన్న సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు జోలికి వెళ్లలేదు. ఒక దఫా కేటాయింపులు జరిగి అవి "వినియోగంలో" ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేసే అవకాశం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరిగిందని ఇప్పుడు తెలంగాణ గోల చేస్తుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎలా తీసుకొంటుంది? కేంద్రం కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోనికి రాకున్నా దానికి అనుగుణంగా ఒకవైపు కర్ణాటకకు పగ్గాలు వదలిపెట్టి మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ గొంతు కోస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించబోతోంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీయస్ కేటాయించిన నాలుగు టిఎంసిల వినియోగానికి కాలువ తవ్వతుండగా ఇప్పుడు కేసీఆర్ గోల చేస్తున్నారు. 11వ షెడ్యూలులో లేని ప్రాజెక్టులను తెలంగాణ చకా చకా నిర్మిచుకుపోతుంటే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ కోర్టులను ఆశ్రయించినట్లు ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులకెక్కడం లేదు? 




రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగని నీళ్లు ఉన్నా లేదా నీటి ఎద్దడి ఉన్నా ఈ సందర్భాల్లో ప్రొటొకాల్ ఏమిటో నిర్ణయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు బాధ్యతను అప్పగించింది. వాస్తవం ఇదైతే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు తిరిగి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం ఎందుకు నివేదిస్తోంది? అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అడ్డుకోలేదు? 




ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు నివేదిస్తే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‍లో "వినియోగం"లో ఉన్న నీటి కేటాయింపులు పక్కనపెట్టే అవకాశం ఉంది. తిరిగి మొత్తంగా కృష్ణ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్‍కు అధికారం దఖలు పడుతుంది. దీనివల్ల ఇప్పుడు ఉన్న కేటాయింపులు మారిపోవచ్చు. ప్రధానంగా బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమకు చేసిన కేటాయింపుల్లో భారీ కోత పడవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ బేసిన్ నుంచి ఇతర బేసిన్ (పెన్నా)లకు నీరు తరలించుతోందనేది తెలంగాణ ప్రధానమైన ఫిర్యాదు. 




సహజ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణ డిమాండ్ సమంజసం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1969లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అప్పటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా బేసిన్‍లో వున్న మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపకం చేసింది. ఒకవేళ తిరిగి పంపిణీ జరిగినా అన్ని రాష్ట్రాల మధ్య జరగాలి. అందుకూ ఈ పాటికే కేంద్రం గండికొట్టింది. అంతే కాదు, బచావత్ ట్రిబ్యునల్ కూడా తన ఫైనల్ తీర్పు చాప్టర్ 7 క్లాజు 14లో 2000 సంవత్సరం మే 31 తర్వాత నియమింపబడే కొత్త ట్రిబ్యునల్ రివ్యూ లేక రివిజన్ చేసే సమయంలో ఏ రాష్ట్రానికైనా తాము కేటాయించిన నీటికి లోబడి అట్టి నీరు "వినియోగంలో" ఉంటే మార్పు చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నది. ఆంధ్ర ప్రదేశ్‍కు చెంది బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరు మొత్తంగా వినియోగంలో వున్నందున బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ కేటాయింపుల జోలికి వెళ్లలేదు. మిగులు నికర జలాలను మాత్రం పంపిణీ చేసి దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు క్యారీ ఓవర్ కింద కేవలం 150 టియంసిలు మిగిల్చింది. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిల మాత్రమే పంపకం చేయాలి. దీనితో పాటు గోదావరి జలాలు 80 టియంసిల కృష్ణకు చేరుతున్నందున తెలంగాణ వాటా ఎంతో నిర్ధారణ అయి వాటిని పంపకం చేయవలసి వుంది. ఇంతకు మించి పంపకానికి ఏమీ నీళ్లు మిగిలి లేవు. అదే జరిగితే రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ ఉన్న ప్రాజెక్టులకు తోడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం అవుతాయి. ఈ ప్రమాదం గ్రహించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వ్యూహాత్మకంగా కేంద్రమంత్రి వద్ద హామీ తీసుకొని సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. 




రాష్ట్ర విభజన అనంతరం 2015 డిసెంబరులో కృష్ణ జలాల పంపిణీ విషయంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. కృష్ణ జలాల పంపిణీ బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య జరగాలనా? లేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనా? అన్న విషయం మీద కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లు నాన బెట్టి తుదకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ వైపు నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట విచారణాంశాలుగా ఉన్న కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణ వ్యూహాన్ని అవగతం చేసుకోగలం: 1) ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో కెసి కెనాలుకు ఉన్న కేటాయింపును సమీక్షించి బేసినులోని ప్రాజెక్టులకు తిరిగి పంపిణీ చేయాలి. 2) పక్క బేసినులోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న కెసి కెనాల్ యస్ఆర్ బిసి సాగర్ కుడి కాలువ తుంగభద్ర ఎగువ కాలువ పంట విధానంలో మార్పుచేసి ఆదా అయ్యే నీటిని ఇతర ప్రాజెక్టులకు కేటాయించాలి. 3) ఇతర మార్గాల ద్వారా వినియోగానికి అవకాశం ఉన్న తెలుగుగంగ ఆర్డీయస్ కుడి కాలువలకు ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ చేసిన నీటి కేటాయింపులను సమీక్షించాలి. ఇవీ తెలంగాణ డిమాండ్లలో కొన్ని. మొత్తం 18 అంశాలు విచారణాంశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి గొంతెమ్మ కోరికలు వ్యక్తం చేస్తే రేపు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు వాస్తవంలో ట్రిబ్యునల్‌ ముందు విచారణ జరిగితే ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమేగాక ఏపీ ప్రజలకు కుచ్చుటోపీ పెడుతుంది. 


వి. శంకరయ్య


విశ్రాంత పాత్రికేయులు

Thursday, 3 June 2021

Godavari - Kaveri Linkage is Dangerous to AP & Telangana.

 విజయవాడ

తేదీ: జూన్ 1, 2021

జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన "ఇచ్చంపల్లి నుండి గోదావరి - కావేరి నదుల అనుసంధానం" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధ్వందంగా తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.

గోదావరి నదిలో లభించే నికర జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1480 టియంసిలను వినియోగించుకోవచ్చని బచావత్ ట్రిబునల్ అవార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు నికర జలాలను వినియోగించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం నిర్మించుకొంటున్నది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్నది. గోదావరిలో నికర జలాలు లేవని చత్తీస్ఘర్ రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పింది.

గోదావరి నదీ జలాల వినియోగంపై కొత్త ట్రిబునల్ ను నియమించమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్రాత పూర్వకంగా కోరితే ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించినట్లు వెల్లడించారు.


ఈ పూర్వరంగంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి దాదాపు 250 టీయంసీలను తరలించడానికి గోదావరి - కావేరి నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టాలనే జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించడం అసంబద్ధం.

మొదటి అంశం నికర జలాలు లేవు. మిగులు/వరద జలాలను అంచనా వేయాల్సింది గోదావరి నదిపై చివరలో నిర్మించబడిన ధవళేశ్వరం ఆనకట్ట వద్ద. పైభాగంలో ఉన్న ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి వరద జలాలను జూన్ - అక్టోబరు మాసాల మధ్య దాదాపు 250 టియంసిలను ఎలా తరలిస్తారు?

జాతీయ నదుల అనుసంధానం పథకంలో భాగంగా మహానది - గోదావరి అనుసంధాన పథకాన్ని చేపట్టాలంటే ముందుగా గంగా - బ్రహ్మపుత్ర - మహానది అనుసంధాన పథకాన్ని అమలు చేస్తేనే అంగీకరిస్తామని ఒడిస్సా పేచీ పెట్టి కూర్చున్నది.  మహానది - గోదావరి అనుసంధాన పథకాన్ని అమలు చేయకుండా గోదావరి - కావేరి నదుల అనుసంధాన పథకాన్ని ఎలా చేపడతారు?

ఈ పథకాన్ని అంగీకరిస్తే గోదావరి నుండి నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని వాడుకొంటారు కాబట్టి కృష్ణా జలాల్లో మాకు వాటా పెంచాలని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రస్తుతం సుప్రీం కోర్టులో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై విచారణలో ఉన్న కేసు సందర్భంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి.

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన ప్రతిపాదన తీవ్రహానికరమైనది. గోదావరి - కృష్ణా - పెన్నా అనుసంధాన పథకాన్ని పోలవరం ప్రాజెక్టు నుండి చేపట్టాలి. 

జాతీయ జల అభివృద్ధి సంస్థ చేసిన గోదావరి - కావేరి(ఇచ్చంపల్లి నుండి) నదుల అనుసంధాన పథకం ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులతో సమావేశాన్ని నిర్వహించి, చర్చించి, సమిష్టి నిర్ణయం తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.

టి.లక్ష్మీనారాయణ

సమన్వయకర్త

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక


Saturday, 22 May 2021

Polavaram - Some Facts

 ఏది వాస్తవ‍ం!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ‍ం 2020_21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికను 2021 మే 19న విడుదల చేసింది. 2021_22 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభ మీ 21న ఆమోదించింది. ఈ రెండు అధికారిక పత్రాలను  ప్రామాణికంగా తీసుకొంటాం. వాటిలో పేర్కొన్న సమాచారం మధ్య తేడా ఉంటే దేన్ని నమ్మాలి?  


పోలవరం బాహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిద్దాం. 2020 నవంబరు నాటికి భూసేకరణ మరియు ఆర్&ఆర్ పనులు 23%, అనుసంధాన పనులు 70.54%, కుడి కాలువ పనులు 90.20%, ఎడమ కాలువ పనులు 68.88%,హెడ్ వర్క్స్ 70.54%, డయాప్ర‍ం వాల్ 100%, జెట్ గ్రౌటింగ్ 100%, తవ్వకం 84.76%, కాంక్రీటింగ్ 77.05% మరియు రేడియల్ గేట్లు 56.92%, మొత్తంగా 74.09% నిర్మాణ పనులు పూర్తయ్యాయని 2020-21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. 


2021_22 బడ్జెట్ ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ 66.86%, కుడి ప్రధాన కాలువ 91.69% మరియు ఎడమ ప్రధాన కాలువ 69.96% పనులు పూర్తయ్యాయి. 


2020-21 సామాజిక, ఆర్థిక అధ్యయన నివేదికను ప్రామాణికంగా తీసుకొంటే 2020 నవంబరు నాటికే పోలవరం హెడ్ వర్క్స్ 70.54% పూర్తి అయినట్లు భావించాలి. 2021_22 వార్షిక బడ్జెట్ ను ప్రామాణికంగా తీసుకొంటే హెడ్ వర్క్స్ 66.86% మాత్రమే పూర్తయినట్లు భావించాలి. 


టి. లక్ష్మీనారాయణ

Monday, 19 April 2021

Polavaram Estimations - పోలవరం అంచనాలు పైపైకి!!

 పోలవరం అంచనాలు పైపైకి!!


Apr 20 2021


పోలవరం అంచనాలు పైపైకి!!


ఒక్కరోజే రూ.2,569 కోట్లు 


రివర్స్‌తో రూ.780 కోట్లు ఆదా అని హల్‌చల్‌


గత ప్రభుత్వంపై ఆరోపణల వెల్లువ


నేడు భారీగా అంచనా వ్యయం పెంపు


ప్రధాన డ్యాం పనుల అంచనా వ్యయం రూ.1,656 కోట్లు పెంపు


కుడి కాలువ నుంచి కొత్తగా ఎత్తిపోతల


దీనికి మరో 912.84 కోట్ల ఖర్చుకు సమ్మతి


అదనపు పనుల కోసం ఇంకో రూ.653 కోట్లు


ఇసుకకు 500 కోట్ల అదనపు చెల్లింపులు


అప్పట్లో ‘రివర్స్‌’తో ఆదా అంటూ ప్రచారం


ఇప్పటికి రూ.3222 కోట్లు పెరిగిన వ్యయం


వీటికి పీపీఏ ఆమోదం లభిస్తుందా?


పోలవరం టెండర్లలో అవినీతి జరిగిందన్నారు. జేబులు నింపుకోవడానికే అంచనా వ్యయం పెంచేశారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వందల కోట్లు ఆదా చేశామని ప్రచారం చేసుకున్నారు. కానీ, గుట్టుచప్పుడు కాకుండా వేల కోట్ల అంచనాలు పెంచేశారు. కొత్త ‘పనులను’ కూడా తెరపైకి తెచ్చారు. ‘రివర్స్‌’తో ఏం జరుగుతోంది? ఆదానా? అదనపు వ్యయమా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)


పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలు ఒక్క రోజులోనే అమాంతం రూ.3,222 కోట్ల మేర పెరిగిపోయాయి. హెడ్‌వర్క్స్‌ అంచనాలను ఒక్కరోజులోనే రూ.2,569.61 కోట్లు పెంచేసిన జగన్‌ ప్రభుత్వం.. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653 కోట్లకు టెండర్లను పిలిచేందుకు సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని నిర్మూలించేందుకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అట్టహాసంగా ప్రకటించారు. టెండరింగ్‌, పనుల అప్పగింతలో అవకతవకల పరిశీలనకు ఓ నిపుణుల కమిటీని కూడా వేశారు. దాని సిఫారసుతో కాంట్రాక్టు సంస్థకిచ్చిన పనులను రద్దుచేశారు. ప్రాజెక్టులో మిగిలిన పనులతో పాటు పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లలో రూ.780 కోట్లు ఆదా అయ్యాయని ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు నానా హడావుడి చేశారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన రూ.1,771.44 కోట్లకు రివర్స్‌ టెండర్‌కు జగన్‌ ప్రభుత్వం వెళ్లింది. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్‌ రూ.1,548 కోట్లకు టెండర్‌ వేసింది. రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.223.44 కోట్లు మాత్రమే మిగిలింది. కానీ హైడల్‌ ప్రాజెక్టు పనులను కలిపి రూ.780 కోట్లు మిగిలాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ పనులు చేజిక్కించుకున్న కొద్ది నెలల్లోనే .. ఇసుక పాలసీలో వచ్చిన మార్పులు.. మార్గదర్శకాల ప్రకారం మెట్రిక్‌ టన్నుకు రూ.375 చెల్లించాలని, జీఎ్‌సటీ, ఇతర పనులు, టెండర్‌ డాక్యుమెంటులోకి రాని ఇతర పనులకు కూడా కలిపి.. అదనంగా రూ.500 కోట్లను చెల్లించాలని ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వమూ సూత్రప్రాయంగా అంగీకరించింది.


అంటే.. అప్పటికే రివర్స్‌ టెండర్‌లో మిగిలింది రూ.223.44 కోట్లయితే.. అదనపు వ్యయం రూ.276.36 కోట్లు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచేసింది. తాజాగా ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనా వ్యయాన్ని మరో రూ.1,656.61 కోట్లకు పెంచుతూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, డిజైన్లు, డ్రాయింగ్‌ల రూపకల్పన, ఎల్‌పీ షెడ్యూళ్లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌-1, గ్యాప్‌-3, గ్యాప్‌ -2, స్పిల్‌ చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌, 25.72 మీటర్ల ఎత్తులో స్పిల్‌వే చెస్ట్‌ నిర్మాణం, వాటికి అవసరమైన అనుబంధ పనులు, 960 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్లాంట్‌ పునాది, అప్రోచ్‌ చానల్‌, ఇన్‌టేక్‌ స్ట్రక్చర్‌, టైల్‌రేస్‌ పూల్‌, టైల్‌ రేస్‌ చానల్‌ వంటి నిర్మాణాల కోసం రూ.5,535.41 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని రూ.7,192.02 కోట్లకు పెంచడం మొదటి ఉత్తర్వు.


ఇంకో ఎత్తిపోతలట!


గోదావరిలో వరద ఉధృతి కారణంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. దీని మరమ్మతు కోసం డెడ్‌ స్టోరేజీలోని నీటిని తోడాల్సి ఉంది. ఈ నీటిని తోడాకే మరమ్మతు చేపట్టాలని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) స్పష్టం చేసింది. అయితే.. ఈ నీటిని తోడేందుకు అయ్యే వ్యయం భరించడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇవ్వలేదు. దీంతో.. ఏకంగా డెడ్‌ స్టోరోజీ నుంచి గోదావరి జలాలను తోడి జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లుగా జల వనరుల శాఖ సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. దీనికి రూ.912.84 కోట్లు వ్యయం అవుతుందంటూ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరు ఇచ్చిన నివేదికకు ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఆమోద ముద్ర వేశారు. పాలనామోదం తెలుపుతూ ఉత్తర్వులిచ్చారు. 


ఇందులో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 32 మీటర్ల ఎత్లులోనున్న నీటిని హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కుడి కనెక్టివిటీ పంప్‌ హౌస్‌ పరిధిలోని సివల్‌, హైడ్రో మెకానికల్‌ ఎలకో్ట్రమెకానికల్‌ వర్క్స్‌ చేపట్టేందుకు, సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటు, ఎర్త్‌ వర్క్‌ తదితర పనులు కూడా ఉన్నాయి. అంటే హెడ్‌వర్క్స్‌ పనుల కోసం పెంచిన రూ.1,656.61 కోట్లు.. కొత్త ఎత్తిపోతలకు రూ.912.84 కోట్లు.. వెరసి అంచనా వ్యయం ఒక్క రోజులోనే రూ.2,569.45 కోట్లు పెరిగిపోయింది. ఒప్పందంలో లేని పనుల పేరిట మరో రూ.653 కోట్లకు టెండర్లను పిలిచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అంటే.. అంచనా వ్యయం దాదాపు రూ.3,222 కోట్ల మేర పెరిగిపోయింది. రివర్స్‌ టెండర్‌లో మిగిలిందంటున్న రూ.233.44 కోట్లకు ఇది 14 రెట్లు ఎక్కువన్నమాట. నిజానికి అంచనాలు పెంచాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జలశక్తి శాఖ అనుమతి పొందాలి. కానీ రాష్ట్రప్రభుత్వం దానికి కనీస సమాచారమైనా ఇవ్వలేదని తెలుస్తోంది.


ఆదిలోనే కేంద్రం అభ్యంతరం


వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరుకు వెళ్తున్నప్పుడు కేంద్ర జలశక్తి శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు.. నిర్ణీత లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తి చేయలేమని స్పష్టం చేసింది. అప్పటి కాంట్రాక్టు సంస్థ వేగంగా .. నాణ్యతతో పనులు చేపడుతున్నందున.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా ఉంటే.. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. అంచనా వ్యయం  పెరిగితే రాష్ట్రమే భరించాలని కూడా జగన్‌ సర్కారుకు తేల్చిచెప్పింది. అయినా ముందుకే వెళ్లిన వైసీపీ ప్రభుత్వం.. కేంద్రానికి సంబంధం లేని జలవిద్యుత్కేంద్రంతో కలిపి రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.780 కోట్ల మేర ఆదా చేశామని చెప్పింది. వాస్తవానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.233.44 కోట్లు మిగిలాయని వెల్లడించలేదు. ఇప్పుడు అంచనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం ఏకీభవించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే 2017 మార్చి 15 నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానం మేరకు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 


ఇప్పటికే 2017-18 సవరించిన అంచనా వ్యయం రూ.55,656.61 కోట్లకు కేంద్రం ఆమోదించలేదు. ఈ అంచనా వ్యయం పెంచినందుకే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. అడ్డగోలు ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి రాగానే.. చంద్రబాబు సవరించిన రూ.55,656.61 కోట్లను ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు. లేఖలూ రాశారు. చివరకు కేంద్ర శాఖలే కుదించిన అంచనా వ్యయం రూ.47,774.87 కోట్లకైనా సమ్మతి తెలపాలని కేంద్రాన్ని వేడుకుంటున్నా ఫలితం లేదు. 45.72 మీటర్ల ఎత్లులో 196 టీఎంసీల నిల్వ చేసేందుకు వీలుగా భూసేకణ కోసం రూ.33,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. అయితే... ఇప్పుడు కొత్తగా 41.15 మీటర్ల ఎత్తులోనే 126 టీఎంసీల నిల్వకు పరిమితం చేస్తూ.. కేవలం రూ.333 కోట్ల మేర భూ సేకరణ, పునరావాసంతో ముగించి.. ప్రాజెక్టును తానే పూర్తిచేశానని ప్రచారం చేసుకోవడానికి జగన్‌ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. దీనికీ కేంద్ర జల సంఘం ఆమోదించడం లేదు. మరి తాజా పెంపును ఆమోదిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి.


అంతన్నారు.. ఇంతన్నారు!


చంద్రబాబు ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిందని.. ముఖ్యంగా పోలవరంలో దోపిడీ చేసింద ని పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల ప్రచారంలో.. చివరకు సీఎం అయిన తర్వాత కూడా జగన్‌ ఆరోపించారు. 2019 సెప్టెంబరు 20న అనిల్‌కుమార్‌ నెల్లూరులో మాట్లాడుతూ.. తొలిరివర్స్‌ టెండరింగ్‌లోనే రూ.300 కోట్ల పనుల్లో రూ.50 కోట్లు ఆదా అయ్యానని.. ఈ ఆదా అయి న సొమ్ము నాటి సీఎం చంద్రబాబు జేబుల్లో నింపుకొన్నారని ఆరోపించారు. ఇప్పుడేమో ఒకేసారి భారీగా అంచనా లు పెంచేశారు. జగన్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంట నే సాగునీటి ప్రాజెక్టులకు రివర్స్‌ టెండర్లను పిలిచారు. హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులకు రూ.1,771.44 కోట్లతో టెండర్లు పిలిస్తే మేఘా సంస్థ ఒక్కటే రూ.1,548 కోట్లకు టెండరు వేసింది. అంటే.. 223.44 కోట్లు తక్కువగా కోట్‌ చేసింది. కనీసం 2 సంస్థలు పాల్గొంటేనే రివర్స్‌ టెండరిం గ్‌ అవుతుంది. ఒక్కటే పాల్గొనడంతో దీనిని జలవనరుల శాఖ రీటెండర్‌గా పరిగణించింది.


ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని 2019 నవంబరు 8న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంటే.. ఈ ఏడాది నవంబరు 8వ తేదీనాటికి ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాలి. అయితే, కాంట్రాక్టు తీసుకున్న కొన్ని నెలలకే రూ.500 కోట్ల అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపింది. గతంలో ఉచిత ఇసుక విధానం ఉండేదని.. ఇప్పుడది లేనందున టన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని.. ఇతరత్రా పనులన్నిటికీ కలిపి మొత్తం రూ.500 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం ఆమోద ముద్ర కూడా వేసింది. రూ.223 కోట్లు ఆదా అయినట్లు చెప్పి.. దానికి 226 కోట్లు అదనంగా కలిపి సమర్పించుకుంటోందన్న మాట. నిజానికి రివర్స్‌ టెండరింగ్‌ నాటికే జగన్‌ ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేయడం గమనార్హం. 

ఎందుకీ ఎత్తిపోత?

పోలవరం ప్రాజెక్టులో రూ.912 కోట్ల కొత్త ఎత్తిపోతల ప్రతిపాదనను ఆకస్మికంగా తెరపైకి తీసుకురావడంలోని మతలబు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయుల కోసమే దీనిని సిద్ధం చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో జల వనరుల శాఖ ఇలాంటి ప్రతిపాదనలు చేయలేదు. కానీ అకస్మికంగా పశ్చిమగోదావరి-కృష్ణా జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాలకు నీరందించేందుకంటూ ఈ ప్రతిపాదన తెచ్చింది. దీని ద్వారా జనవరి నుంచి ఏప్రిల్‌ దాకా ఎన్ని నీళ్లు ఎత్తిపోస్తారో నికరమైన వివరాలు లేవు. ఇవేమీ లేకుండా ఏకంగా రూ.912 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.



Wednesday, 20 January 2021

నేడు పోలవరంపై కీలక భేటీ - Polavaram meeting Jalsakti

 నేడు పోలవరంపై కీలక భేటీ

Jan 20, 2021, 04:24 IST

Keynote meeting will be held in Delhi on revised estimated cost of Polavaram - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డిలు భేటీ కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ను ఇవ్వడంపై వారు చర్చిస్తారు.

2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. దాంతో 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఖరారుచేసి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు జల్‌శక్తి శాఖ కసరత్తు చేస్తోంది. 






Monday, 17 August 2020

ముంచెత్తిన గోదారి Aug 18, 2020, 02:48 IST

 ముంచెత్తిన గోదారి

Aug 18, 2020, 02:48 IST

Assurance of public representatives and authorities to the victims in flooded areas - Sakshi

రాజమహేంద్రవరంలో నీట మునిగిన కోటిలింగాలరేవు కైలాసభూమి


ఉప నదులు, వాగులు ఉప్పొంగుతుండడంతో పెరిగిన వరద


ధవళేశ్వరం బ్యారేజీలోకి 19,69,535 క్యూసెక్కుల ప్రవాహం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ


సోమవారం రాత్రికి బ్యారేజీలోకి వచ్చే వరద 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా


నేటి ఉదయానికి 14 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం


విస్తృతంగా సర్కార్‌ సహాయక చర్యలు.. ప్రజలు పునరావాస శిబిరాలకు తరలింపు


ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారుల భరోసా


నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉపనదులు.. ప్రాణహిత, ఇంద్రావతి, శబరిలతోపాటు ఇతర కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లోని విలీన మండలాలు, కోనసీమలో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. రాకపోకలు స్తంభించాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే వేలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఉచితంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేశారు.



సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద మట్టం 61.20 అడుగులకు చేరుకోవడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 19,69,535 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 2013 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. 175 గేట్లు ఎత్తి 20,01,525 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. సోమవారం రాత్రికి వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరి మంగళవారం ఉదయానికి 14 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగిలో, చింతూరు మండలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది  


విలీన మండలాల్లో వరద బీభత్సం

► గోదావరి, శబరి నదుల ఉధృతితో విలీన మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ మండలాల్లో సుమారు 100 గ్రామాలు ముంపులో ఉన్నాయి. 

► పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, 20 శివారు గ్రామాలు నీట మునిగాయి. కుక్కునూరు మండలంలో 10 గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.

► దేవీపట్నం మండలంలో పోచమ్మగండి అమ్మవారి ఆలయంతోపాటు ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. 

► తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

► స్తంభాలు ముంపులో ఉండటంతో విలీన మండలాల్లో విద్యుత్‌ నిలిచిపోయి అంధకారం అలుముకుంది. అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్‌ నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆరు అడుగుల మేర నీరు చేరింది. వశిష్ట గోదావరి పోటెత్తడంతో నర్సాపురం వద్ద పొన్నపల్లి, మాధవాయిపాలెం, కొండాలమ్మగుడి ప్రాంతాల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరింది.  

వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పోశమ్మగండిలో నీటమునిగిన ఇళ్లు 


ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం

► విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. పోలవరం, గోదావరి డెల్టా సీఈలతో సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

► మొత్తం ఆరు రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. దేవీపట్నం మండలంలో 5,800 కుటుంబాలను, వేలేరుపాడు మండలంలో 1,346 కుటుంబాలను, కుక్కునూరు మండలంలో 687 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

► పోలవరం గ్రామంలో నెక్లెస్‌బండ్‌ బలహీనంగా ఉండటంతో పటిష్టపరిచే పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. 

► రంపచోడవరం మన్యంలో నిర్వాసితులకు రేషన్, ఇతర నిత్యావసరాలు ముందుగానే పంపిణీ చేశారు. 

► కోనసీమ ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్, ఎంపీ అనూరాధ, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.  


Saturday, 6 June 2020

డీపీఆర్‌లు ఇవ్వండి- తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు

Jun 5 2020 @ 03:12AMహోంతెలంగాణ

డీపీఆర్‌లు ఇవ్వండి కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు తేల్చిచెప్పిన కృష్ణా బోర్డు
ప్రభుత్వాలతో మాట్లాడి చెప్తామన్న అధికార్లు
పట్టిసీమలో 45 టీఎంసీల వాటా ఇవ్వాలి
సాగర్‌లోని 50 టీఎంసీలు క్యారీ ఓవరే
పోతిరెడ్డిపాడుతో 175 టీఎంసీలు తోడారు
పోతిరెడ్డిపాడు విస్తరణ,
రాయలసీమ లిఫ్ట్‌ ఆపేయాలి: తెలంగాణ
మా కోటా నీటి వాడకానికే ఆ ప్రాజెక్టులు: ఏపీ
తెలంగాణ వాదనలో మోదీ ఎన్నికల ప్రసంగం
ఈ ఏడు కూడా పాత పద్ధతినే కేటాయింపులు


హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణా బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జల సౌధలో గురువారం ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM




తెలంగాణ తరఫున సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం ఇంజనీర్లు, ఏపీ నుంచి సాగు నీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత డీపీఆర్‌లు సమర్పిస్తామని అధికారులు బోర్డుకు తెలిపారు.



వాటిని ఆపేయండి.. కోటా మార్చండి

తొలుత తెలంగాణ అధికారులు తమ వాదన వినిపించారు. ప్రత్యేక ప్రజంటేషన్‌ ఇచ్చారు. తమ ప్రాజెక్టులకు నష్టం కలిగించే, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుతం ఉన్న కోటా (తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు)లో మార్పులు చేయాలని కోరారు. తాగు నీటి కోసం కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నదాంట్లో 45 టీఎంసీలు తమకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న 50 టీఎంసీలు తెలంగాణకే చెందుతాయని, వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని పేర్కొన్నారు.



పోతిరెడ్డిపాడు నుంచి ఏడాదికి 101 టీఎంసీలను మాత్రమే తరలించాల్సి ఉండగా.. ఏపీ గతేడాది 175 టీఎంసీలను తీసుకుందని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డిపై ఏపీ ఫిర్యాదును ప్రస్తావిస్తూ, వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టారని, దీనికి సాక్ష్యంగా 2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీచేసిన ప్రసంగాన్ని వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి పాత ప్రాజెక్టేనని చెప్పడమే తమ ఉద్దేశమని తెలంగాణ అధికారులు వివరించారు.



మా ప్రాజెక్టులనూ రీ డిజైన్లుగానే చూడండి

కృష్ణా బేసిన్‌లో తమ కోటా నీటి వినియోగానికే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతలను చేపడతున్నట్లు ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు రీ డిజైన్‌ అయినప్పుడు, తమవాటినీ అలాగే భావించాలన్నారు. రాష్ట్ర విభజన 2014లో జరిగినందున.. తర్వాత జారీ చేసిన జీవోలన్నీ కొత్త ప్రాజెక్టుల కోసమనే పరిగణించాలని కోరారు. ఈ లెక్కన పాలమూరు-రంగారెడ్డి, డిండి కొత్త ప్రాజెక్టులేనని అన్నారు. అనుమతులు వచ్చేవరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని బోర్డు సూచించింది.



బోర్డు తీసుకున్న నిర్ణయాలు..

గత ఏడాదిలానే బేసిన్‌ నీటిని రెండు రాష్ట్రాలు 66: 34 శాతం నిష్పత్తిలో ఉపయోగించుకోవాలి. నీటి లెక్కలు తేలేవరకు వాడకం ఇదే పద్ధతిన సాగాలి.
టెలీమెట్రీ యంత్రాల రెండో దశ ఏర్పాటును కచ్చితంగా అమలు చేయాలి.
శ్రీశైలం జల విద్యుత్‌ను చెరిసగం వాడుకోవాలి.
బేసిన్‌లో మిగులు జలాలను సమానంగా వాడుకోవాలి. 2019-20లో ఉపయోగించుకున్న మిగులు నీటి లెక్కల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలి.
సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో నీటి నష్టంపై ఇప్పటికే నియమించిన కమిటీ క్షేత్ర పరిశీలన చేయాలి.
తాగునీటికి అవసరాలకు కేటాయించే నీటిలో 20 శాతమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై కేంద్ర జల సంఘానిదే తుది నిర్ణయం.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ఉన్న తెలంగాణ నీటి వాటాను క్యారీ ఓవర్‌గా పరిగణించడంపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకుని, బోర్డు మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి వస్తుంది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న గోదావరి నీటిలో తెలంగాణ వాటాను తేల్చే అంశం, కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలింపుపై నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి అప్పగింత.


నేడు గోదావరి బోర్డు సమావేశం

గోదావరి బోర్డు శుక్రవారం సమావేశం కానుంది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్‌పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈ అంశాలపై చర్చించడానికి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.