Friday, 3 June 2016

చురుగ్గా కొండవీటి వాగు ముంపు నివారణకు చర్యలు

చురుగ్గా కొండవీటి వాగు ముంపు నివారణకు చర్యలు 
03-06-2016 06:49:54

  • ప్రయోగాత్మకంగా వాగు వెడల్పు పెంపు 
  • ఉండవల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపంలో ఎత్తిపోతల
మంగళగిరి: కొండవీటివాగు పరీవాహక ప్రాం తం వెంట ఏర్పాటవుతున్న రాజధానికి వరద ముప్పు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.పూడికతీత, అవసరమైన చోట్ల వెడల్పు చేయడం వాగును నిటారుగా వెళ్లేలా చర్యలతోపాటు ఉండవల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. ఈ పనులను ఆగమేఘాల మీద చేపడుతున్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలకు కొండవీటివాగు ముంపు సమస్య ఉంది. రాజధానే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలోకి రావడంతో మున్ముందుగా కొండవీటివాగు ముంపును ఎదుర్కొనే అంశమై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ ఖరీఫ్‌ సీజనులో ప్రభుత్వ ప్రణాళిక ఈ వ్యవహారంలో ప్రయోగాత్మకంగా ఉండనుంది. సాధారణంగా కొండవీటివాగు సాధారణ ప్రవాహం ఆరు వేల క్యూసెక్కులు కాగా భారీ వర్షాల నేపథ్యంలో అది 15 వేల క్యూసెక్కుల వరకు ఉంటుంది. ఆ సందర్భం లో కొండవీటివాగు కట్టలు తెగిపోవడంతో పరీవాహక ప్రాంతాలు వరద ముంపుకు గురవుతాయి. కృష్ణానదికి కూడా పెద్ద ఎ త్తున వరద నీరు చేరడంతో నది నీటిమట్టం కొండవీటివాగు నీటిమట్టాన్ని మించిపోతుండడంతో వరద ముంపు ఉధృతి తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన ఇరిగేషన్‌ నిపుణుల బృందం ప్రస్తుత ఏడాదికి ప్రయోగాత్మకంగా ముంపు నివారణా చర్యలను చేపడుతోంది.
4 నుంచి 5 మీటర్ల వెడల్పు.. 
కొండవీటివాగును పూడికను తొలగించడంతోపాటు అనేకచోట్ల వాగును నాలుగు నుంచి ఐదు మీటర్లు అదనంగా వెడల్పు పెంచనున్నారు. వాగు ఎడమ పక్క వైపున ఈ విస్తరణ జరుగుతోంది. వాగు కృష్ణానదిలో కలిసే ప్రాంతమైన ఉండవల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేయనున్నారు. దీని సాయంతో పది వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి పంపిస్తారు. మరో నాలుగు వేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించడం ద్వారా కొండవీటివాగు గరిష్ట వరద ఉధృతి నివారించవచ్చునని నిపుణులు అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. 
వర్టికల్‌ పంపుల ఏర్పాటు 
తాడేపల్లి: కొండవీటివాగు ముంపు నివారణకు పది వేల క్యూసెక్కుల వాగు నీటిని కృష్ణానదిలోకి పంపే విధంగా వర్టికల్‌ పంపులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఇరిగేషన్‌ సీఈ సుధాకర్‌ తెలిపారు. గురువారం ఉండవల్లి హెడ్‌రెగ్యులేటర్‌ను పరిశీలించేందుకు అధికారులతో కలిసి విచ్చేసిన ఆయన కొద్దిసేపు విలేకర్లతో మాట్లాడారు. మోటార్లు, జనరేటర్లు ఏర్పాటు చేసి వాగు నీటి ముంపు నివారణకు వర్టికల్‌ పంపుల ద్వారా వరదలు వచ్చినప్పుడు కృష్ణానదిలో కలిపే ఏర్పాటు చేస్తే వరద ప్రవాహం అరికట్టగలమన్నారు. ప్రస్తుతం కొండవీటివాగులో ఉన్న నీటిని ఉండవల్లి హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా బకింగ్‌హామ్‌ కెనాల్‌లోకి మళ్లిస్తున్నారు. నీరుకొండ వద్ద పూడికతీత కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా అటువైపు నీరు మళ్లితే ఇబ్బంది కావడంతో పలు చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో అధికారులు ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌టీ చౌదరి, ఈఈ బాబూరావు, డీఈ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment