Monday, 5 October 2015

పోలవరానికి 30,500 కోట్లు

 హోం >> ఆంధ్రప్రదేశ్ >> ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు
పోలవరానికి 30,500 కోట్లు
Updated :05-10-2015 02:14:58
  • రూ.14 వేల కోట్లు పెరిగిన నిర్మాణ వ్యయం
  • సింహభాగం భూసేకరణ, పునరావాసానికే
  • కాంక్రీటు పనులకు రూ.6,700 కోట్ల అంచనా
  • రూ.1,500-2,000 కోట్లు పెరిగే చాన్స్‌
  • పనుల పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్‌ కమిటీ
  • ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సమీక్ష
  • ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత మంత్రివర్గానికి
హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనా రూ.30,500 కోట్లు! ఇందులో ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేవలం రూ.6700 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. కానీ, సింహ భాగం మాత్రం భూ సేకరణ, పునరావాసానికే ఖర్చు కానుంది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనాతో పోలిస్తే రూ.14 వేల కోట్ల వరకు పెరగనుంది. పోలవరం పనులను శరవేగంగా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచనల మేరకు.. కొత్తగా కలిసిన ఏడు ముంపు మండలాల్లోని గ్రామాలకు పరిహారం, పునరావాసంతోపాటు మిగిలిన కాంక్రీట్‌ పనులకు సంబంధించి తాజా అంచనాలు దాదాపు సిద్ధమయ్యాయి. భూ సేకరణ కోసం ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించని, సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయని గ్రామాలకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు.
పునరావాస కార్యక్రమాలు చేపడతారు. తాజా అంచనాల్లో సింహభాగం దీనికే కేటాయించారు. జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శనివారం సచివాలయంలో పోలవరం తాజా అంచనాలపై ఆ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారు. కొత్త అంచనాలపై సమీక్షించారు. పోలవరం ప్రస్తుత అంచనా రూ.16,010 కోట్లుగా ఉందని, తాజాగా భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ను పరిగణనలోకి తీసకుంటే రూ.30,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పూర్తిస్థాయి అంచనాలు సోమవారం నాటికి ఖరారవుతాయని చెబుతున్నారు. కాంక్రీట్‌ పనుల్లో అంచనాలు గతంతో పోలిస్తే రూ.1500 కోట్లు నుంచి రూ.2000 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు.
పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు ఇప్పటి వరకూ రూ.7880 కోట్లు ఖర్చు చేశారు. ముంపు మండలాల్లో కొన్ని గ్రామాలకు ఇప్పటికే సహాయ పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు జరిగిపోయింది. ఇక్కడి వారికి గృహ నిర్మాణం నెలాఖరుకు పూర్తవుతుంది. మరో 50,000 ఎకరాల వరకూ భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. వాటికి కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. పునరావాసం పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్రామాలు ఏపీలోకి వచ్చినందున వారికి పునరావాసం ఎక్కడ కల్పించాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పెరిగిన అంచనాల్లో సింహభాగం భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపుల కోసమేనని అధికారులు చెబుతున్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీట్‌ పనులు మాత్రం మందకొడిగా జరుగుతున్నాయి.
ఏడు శాతం కూడా మించలేదు. ఈ పనుల వేగాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎర్త్‌ డ్యామ్‌, కాంక్రీట్‌ డ్యామ్‌ స్పిల్‌వే, ఎర్త్‌ అండ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, ఎర్త్‌ వర్క్‌ చాలావరకు మిగిలిపోయిందని సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీయాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఒక కోటి 70 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వారని, ఇంకా పది కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టిని తవ్వాల్సి ఉందని చర్చకు వచ్చింది. ఎర్త్‌ కాంక్రీట్‌ లైన్‌ స్పిల్‌వే, గేట్ల ఏర్పాటు వంటి పనులు చేయాల్సి ఉందని, వీటిని వేగవంతం చేయాలంటే నెలాఖరుకు భూ సేకరణ, పునరావాస పనులు పూర్తి చేయాల్సిందేనని సమావేశం అభిప్రాయపడింది. ప్రాజెక్టు పనులను నిరంతరం థర్డ్‌ పార్టీ ద్వారా సమీక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ పేరుతో ఒక కన్సల్టెన్సీని వేయాలని నిర్ణయించారు.
ఇవే అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌తో చర్చించిన తర్వాత తుది అంచనాలపై ఒక నిర్ణయానికి వస్తారు. అనంతరం వాటిని ‘ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ కమిటీ (ఐబీఎంసీ) సమీక్షించి స్థిర వ్యయాన్ని అంచనా వేస్తుంది. దానిని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడతారు. మంత్రివర్గ సమావేశం ఆమోదం తర్వాత పనులు త్వరితగతిన చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తారు.

No comments:

Post a Comment