Wednesday, 28 October 2015

పోలవరం.. ఇంజనీరింగ్‌ అద్భుతం!

పోలవరం.. ఇంజనీరింగ్‌ అద్భుతం!
Updated :29-10-2015 02:15:04
  • 11 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీతకు ప్రణాళిక
  • 330 అడుగుల లోతు నుంచి డయాఫ్రం గోడ
  • నవంబర్‌ నుంచి మట్టి తవ్వకం
  • జనవరి నుంచి డయాఫ్రం పనులు
  • రెండేళ్ళలో ఒక రూపు తేనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):
 గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అద్భుతాల్లో ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టల నిర్మాణంలో ఈ ప్రాజెక్టు చోటు సంపాదించబోతోందని, గిన్నిస్‌ రికార్డులకు ఎక్కినా ఆశ్చర్యపడనక్కరలేదని సాగునీటి శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద చేయాల్సిన పనులకు సంబంధించిన అంకెలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేయడానికి తీయాల్సిన మట్టి పదకొండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని అంచనా. ఏపీలో గతంలో నిర్మాణం జరిగిన ఏ సాగునీటి ప్రాజెక్టులోనూ ఇంత మట్టిని తీయాల్సిన అవసరం రాలేదు. సాధారణంగా చిన్నచిన్న ప్రాజెక్టుల్లో వాడే టిప్పర్లలో 14 టన్నుల మట్టి పడుతుంది. ఈ ప్రాజెక్టు కింద మట్టి తరలింపును వేగవంతం చేయడానికి 30 టన్నులు, 60 టన్నులు మోయగలిగే టిప్పర్లను రంగంలోకి దించాలని కాంట్రాక్ట్‌ సంస్థను అధికారులు ఆదేశించారు. నెలకు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీసి తరలించాలని సాగునీటి శాఖ యోచన. ఈ లెక్కన మొత్తం పదకొండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలించడానికి 22 నెలలు పట్టే అవకాశం ఉంది. వానాకాలం ఇంత వేగంగా పనిచేయడం సాధ్యం కాదు. అందువల్ల 24 నెలల్లో ఈ పనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కానీ, సీఎం చంద్రబాబు ఈ లక్ష్యానికి సంతృప్తి పడినట్లు కనిపించలేదు. నెలకు కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపు సాధ్యపడదా అని అధికారులను ప్రశ్నించారు. సాధ్యంకాదన్న అభిప్రాయంలో అధికార వర్గాలు ఉన్నాయి. తవ్వి తీసిన మట్టిన పదిహేను కిలోమీటర్ల దూరం తరలించి అక్కడ పోస్తున్నారు. తీసిన మట్టిలో కేవలం 35 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి మాత్రమే పోలవరం నిర్మాణానికి వాడుతున్నారు. మిగిలిన మట్టి అంతటినీ వేరేచోటకు తరలించి అక్కడ పోస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద డయాఫ్రం గోడ
డయాఫ్రం గోడ నిర్మాణం మరొక ఇంజనీరింగ్‌ అద్భుతంగా అధికారులు చెబుతున్నారు. ఈ గోడను నదిలో నీటి మట్టానికి దిగువన నిర్మిస్తారు. 110 మీటర్లు లోతులో దీనిని నిర్మిస్తున్నారు. ఐదు అడుగుల మందంగా కాంక్రీట్‌తో దీన్ని నిర్మిస్తారు. ఐదు వేల అడుగుల పొడవున దీని నిర్మాణం జరుగుతుంది. నదికి ఎంత వరద వచ్చినా తట్టుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. భూభౌతిక పరీక్షలు జరిపినప్పుడు ఈ గోడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో 330 అడుగుల దిగువన రాయి తగిలింది. అక్కడ నుంచి ఆరు అడుగుల దిగువ వరకూ ఈ గోడ నిర్మాణం జరుపుతున్నారు. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా గోడ దాటి కిందకు వెళ్ళదని అధికారులు చెబుతున్నారు. మన దేశంలో ఈ స్థాయి డయాఫ్రం గోడ నిర్మాణం ఇదే ప్రథమం. ప్రపంచంలో కూడా ఇదే పెద్దది కావచ్చునని అధికారులు అంటున్నారు. దీని నిర్మాణానికి జర్మనీ సంస్ధను ఒకదానిని రంగంలోకి తెచ్చారు. కనీస అనుభవం ఉన్న కంపెనీ కోసం అన్వేషించి ఈ సంస్థను ఎంపిక చేశారు. ఈ సంస్థ మన దేశంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు భాగస్వామిగా ఉంది. ఈ గోడపై మరో ఆనకట్ట వస్తుంది. అది సుమారుగా 130 అడుగుల ఎత్తు ఉండనుంది. దానిని ఎర్త్‌ అండ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాంగా పిలుస్తున్నారు. డయాఫ్రం గోడ నిర్మాణాన్ని రెండేళ్ళలో పూర్తిచేసి ఆ తర్వాత పై ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వేసవి లోపు ఇందులో చాలా భాగం పనిని చేపట్టాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ప్రణాళిక రూపొందిస్తున్నారు. మట్టి పని ఇప్పటికే కొంత జరిగింది. యంత్రాలు, పెద్ద టిప్పర్లు తేవడం ద్వారా నవంబర్‌ నుంచి నెలకు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం లక్ష్యం అందుకోవాలని నిశ్చయించారు. అవసరమైన పరీక్షలు పూర్తి చేసి డయాఫ్రం గోడ నిర్మాణం జనవరిలో మొదలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ నిర్మాణ ప్రాంతం వద్ద ఇంకా మూడు గ్రామాల వారిని తరలించాల్సి ఉంది. వారికి అవసరమైన పరిహారం, పునరావాస చెల్లింపులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టిసీమకు సంబంధించి మిగిలిపోయిన పనులు, పోలవరం పనులకు వచ్చే వేసవి ముగిసేలోపు సుమారుగా రూ.2వేల కోట్లు అవసరం అవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఈ బడ్జెట్‌ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు.

No comments:

Post a Comment