Friday 27 March 2015

భగీరథుడు గంగకోసం తపస్సు చెయ్యుట-శ్రీ రామాయణం

విష్ణు
భగీరథుడు గంగకోసం తపస్సు చెయ్యుట-శ్రీ రామాయణం

అశ్వమేధం,సగరుడు స్వర్గానికి పోవుట

ఎన్నాళ్లకీ కొడుకులు తిరిగి రాకపోవడం చూసి, సగరుడు దివ్యతేజోభిరాముడూ, మనుమడూ అయిన అంశుమంతుణ్ణి 'నాయనా! నువ్వు మహాశూరుడవు. శస్త్రాస్త్రవిద్యలు క్షుణ్ణంగా తెలిసినవాడవు. నీ పినతండ్రులు వెళ్లి చాలాకాలం అయింది. వెళ్లి వెదకి వాళ్లని తీసుకురా. గుర్రపు దొంగల్నీ పట్టుకురా. వెళ్లిన పని చక్కగా నెరవేర్చుకొని నా యజ్ఞం పూర్తి అయ్యేటట్టు తిరిగిరా' అని ఆజ్ఞాపించాడు.

తాత ఇలా చెప్పగా, అంశుమంతుడు ధనుర్బాణాలు ఖడ్గము ధరించి వెళ్ళి తండ్రులు తవ్విన గోతులలోంచి పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ దిగ్గజం కనబడింది. దైత్యులూ దానవులూ రాక్షసులూ, పిశాచాలూ పక్షులూ పన్నగులూ ఆ దిగ్గజాన్ని పూజిస్తున్నారు. తానున్నూ దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, కుశలమున్నూ అడిగి, అంశుమంతుడు తన తండ్రుల సంగతీ గుర్రపుదొంగ సంగతీ చెప్పమనికోరాడు. దానికి ఆ దిగ్గజం 'అంశుమంతుడా! నువ్వు కృతార్థుడవు అవుతావు. గుర్రాన్ని కూడా తీసుకువెడతావు' అని చెప్పింది. ఆ మాట విని తక్కిన దిగ్గజాలనూ కూడా అలాగే పూజించి అతను వాటినిన్నీ అలాగే అడిగాడు. అవి కూడా 'నువ్వు కృతార్థుడవు అవుతావు. గుర్రాన్ని తీసుకునివెడతావు' అని చెప్పాయి.

తరువాత, అంశుమంతుడు తన పినతండ్రులందరూ బూడిద అయి పడివుండిన చోటికి వెళ్ళాడు. ఆ భస్మరాసులు చూసి అతను చాలా దుఃఖించాడు. అలా శోకిస్తూనే అతను సమీపంగానే అటూ యిటూ తిరుగుతూ వున్న గుర్రాన్ని చూశాడు. తన పినతండ్రుల కందరికీ తర్పణం చేద్దామని అతను ప్రయత్నించాడు. కాని అతనికి జలాశయం ఏదీ కనబడలేదు. దాంతో అతను దిగులపడిపోయి అటూ ఇటూ చూశాడు. సాగరులకు మేనమామ, ఖగపతీ అయిన గరుడుడు అంశుమంతుణ్ణి చూసి, 'పురుషవ్యాఘ్రా! విచారించకు. నీ పినతండ్రుల మరణం లోకశాంతికి అగత్యం అయింది. మహాబలవంతులైన సగరు లందరూ అప్రమేయుడైన కపిలునివల్ల భస్మం అయిపోయారు. వీరికి నువ్వు లౌకిక జలంతో తర్పణం చెయ్యగూడదు. హిమవంతుని పెద్దకూతురైన గంగానదిలో వారికి తర్పణం చెయ్యి. లోకపావని అయిన గంగాదేవి వీరిని తడపగలదు. ఈ భస్మ రాసులు గంగాజలంతో తడిస్తే నీ పినతండ్రులు స్వర్గసుఖం పొందుతారు. ఇప్పటికి నువ్వు గుర్రాన్ని తీసుకువెళ్లి మీ తాతగారి యజ్ఞం పూర్తి చేయించు' అని చెప్పాడు.

ఆమాట మీద అంశుమంతుడు గుర్రాన్ని తీసుకు వెళ్ళి సగరునికి అప్పగించి, జరిగిన సంగతీ, గరుడుడు చెప్పిన మాటలూ విన్నవించాడు. కొడుకులు పోయినందుకు చాలా విచారించి సగరుడు యథాశాస్త్రంగా అశ్వమేథం నిర్వర్తించుకుని పట్నం ప్రవేశించాడు. గంగను తీసుకురావాలంటే అతని కుపాయం తోచలేదు. తరువాత అతను ముప్ఫయివేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. బతికివుండినంత కాలం అతడు ఉపాయాలు వెతుక్కుంటూనే వుండినాడు; కాని యేమీ చెయ్యలేక చివరికి కాలం చేశాడు.

భగీరథుడు గంగకోసం తపస్సు చెయ్యుట

సగరుడు చనిపోగా మంత్రులు ధార్మికుడైన అంశుమంతునికి పట్టాభిషేకం చేశారు. అంశుమంతుడు గొప్పరాజని ప్రఖ్యాతి పొందాడు. అతని కొడుకు దిలీపుడు. దిలీపునికి పట్టాభిషేకం చేసి అంశుమంతుడు హిమవత్పర్వతానికి వెళ్ళి పన్నెండువేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తాతల దుర్మరణం సంగతి తెలుసుకొని దిలీపుడు చాలా విచారించాడు. 'గంగను తీసుకు రావడం యెలాగ? వారికి గంగాజలంతో తర్పణం చెయ్యడం యెలాగ? వారినెలాగ తరింప చెయ్యడం' అని అతను చాలా ఆలోచించాడు; కాని ఉపాయం తోచలేదు. ఇలా విచారణచేస్తూ వుండగానే అతనికొక కొడుకు పుట్టా డు. అతనే పరమ ధార్మికుడైన భగీరథుడు. దిలీపుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు. ముప్ఫయివేల సంవత్సరాలు రాజ్యం కూడా చేశాడు. అయినా తాతల నుద్ధరించడానికి అతనికి దారి దొరకలేదు. ఇంతలో జబ్బు చేసి అతను కాలధర్మం పొందాడు. తాను చేసిన పుణ్యకార్యాల వల్ల అతను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. జబ్బు చెయ్యక పూర్వమే అతను భగీరథునికి రాజ్యాభిషేకం చేశాడు. భగీరథునికి సంతానం లేదు. ఎన్ని ఉపాయాలుపన్నినా అతనికి సంతానవాంచ తీరలేదు. చివరికి అతను గంగనయినా తీసుకురావాలని దృఢనిశ్చయం చేసుకుని తపస్సు ప్రారంభించాడు. తపస్సుకోసం అతను గోకర్ణం అనే క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఊర్ధబాహుడై నెలకొక్క పూటే భోజనం చేస్తూ పంచాగ్ని మధ్యంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు.

అందు కానందించి బ్రహ్మ సురసమూహాలతో కూడా వచ్చి 'రాజా! నీ నిష్ఠకు మెచ్చుకున్నాను. నీకేమి కావాలో కోరుకో' అన్నడు. అప్పుడు భగీరథుడు వినయవినమ్రుడై దోసిలివొగ్గి 'దేవదేవా! నీకు నామీద అనుగ్రహం వున్నట్టయితే - నేను చేసిన తపస్సుకు ఫలం వుండేటట్టయితే సగరుని కొడుకులు అరవైవేలమందీ నావల్ల ఇన్ని నీళ్లు పొందిన వాళ్లు కావాలి. గంగాజలంతో తమ భస్మరాసులు తడిస్తే వారు స్వర్గానికి వెళ్లిపోతారు. నేను సంతానరహితుణ్ణి. ఇక్ష్వాకువంశ వృద్ధికోసం నాకు సంతానమున్నూ దయచెయ్యి' అని కోరాడు.

అందుకానందించి బ్రహ్మదేవుడు 'భగీరథుడా! నీ కోరిక చాలా గొప్పది. నీకు భద్రం అగుగాక! నీ కోరికలు నెరవేరుగాక! హిమవంతుని పెద్దకూతురైన గంగను భరించగలవాడు శివుడు తప్ప మరొకడు లేడు. గంగ ఆకాశం నుంచి పడితే భూమి భరించలేదు; కనుక , అందుకు ఈశ్వరుణ్ణి నియోగించు' అని భగీరథునితో చెప్పి, 'భగీరథుడు ఎప్పుడు కోరితే అప్పుడు నువ్వు అతనితో భూలోకానికి వెళ్లు' అని గంగకున్నూ అజ్ఞాపించి దేవగణాలతో తన లోకానికి వెళ్లిపోయాడు.