Wednesday 28 October 2015

పోలవరం.. ఇంజనీరింగ్‌ అద్భుతం!

పోలవరం.. ఇంజనీరింగ్‌ అద్భుతం!
Updated :29-10-2015 02:15:04
  • 11 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీతకు ప్రణాళిక
  • 330 అడుగుల లోతు నుంచి డయాఫ్రం గోడ
  • నవంబర్‌ నుంచి మట్టి తవ్వకం
  • జనవరి నుంచి డయాఫ్రం పనులు
  • రెండేళ్ళలో ఒక రూపు తేనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):
 గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అద్భుతాల్లో ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టల నిర్మాణంలో ఈ ప్రాజెక్టు చోటు సంపాదించబోతోందని, గిన్నిస్‌ రికార్డులకు ఎక్కినా ఆశ్చర్యపడనక్కరలేదని సాగునీటి శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద చేయాల్సిన పనులకు సంబంధించిన అంకెలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేయడానికి తీయాల్సిన మట్టి పదకొండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్లు ఉంటుందని అంచనా. ఏపీలో గతంలో నిర్మాణం జరిగిన ఏ సాగునీటి ప్రాజెక్టులోనూ ఇంత మట్టిని తీయాల్సిన అవసరం రాలేదు. సాధారణంగా చిన్నచిన్న ప్రాజెక్టుల్లో వాడే టిప్పర్లలో 14 టన్నుల మట్టి పడుతుంది. ఈ ప్రాజెక్టు కింద మట్టి తరలింపును వేగవంతం చేయడానికి 30 టన్నులు, 60 టన్నులు మోయగలిగే టిప్పర్లను రంగంలోకి దించాలని కాంట్రాక్ట్‌ సంస్థను అధికారులు ఆదేశించారు. నెలకు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీసి తరలించాలని సాగునీటి శాఖ యోచన. ఈ లెక్కన మొత్తం పదకొండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలించడానికి 22 నెలలు పట్టే అవకాశం ఉంది. వానాకాలం ఇంత వేగంగా పనిచేయడం సాధ్యం కాదు. అందువల్ల 24 నెలల్లో ఈ పనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కానీ, సీఎం చంద్రబాబు ఈ లక్ష్యానికి సంతృప్తి పడినట్లు కనిపించలేదు. నెలకు కోటి క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపు సాధ్యపడదా అని అధికారులను ప్రశ్నించారు. సాధ్యంకాదన్న అభిప్రాయంలో అధికార వర్గాలు ఉన్నాయి. తవ్వి తీసిన మట్టిన పదిహేను కిలోమీటర్ల దూరం తరలించి అక్కడ పోస్తున్నారు. తీసిన మట్టిలో కేవలం 35 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి మాత్రమే పోలవరం నిర్మాణానికి వాడుతున్నారు. మిగిలిన మట్టి అంతటినీ వేరేచోటకు తరలించి అక్కడ పోస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద డయాఫ్రం గోడ
డయాఫ్రం గోడ నిర్మాణం మరొక ఇంజనీరింగ్‌ అద్భుతంగా అధికారులు చెబుతున్నారు. ఈ గోడను నదిలో నీటి మట్టానికి దిగువన నిర్మిస్తారు. 110 మీటర్లు లోతులో దీనిని నిర్మిస్తున్నారు. ఐదు అడుగుల మందంగా కాంక్రీట్‌తో దీన్ని నిర్మిస్తారు. ఐదు వేల అడుగుల పొడవున దీని నిర్మాణం జరుగుతుంది. నదికి ఎంత వరద వచ్చినా తట్టుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. భూభౌతిక పరీక్షలు జరిపినప్పుడు ఈ గోడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో 330 అడుగుల దిగువన రాయి తగిలింది. అక్కడ నుంచి ఆరు అడుగుల దిగువ వరకూ ఈ గోడ నిర్మాణం జరుపుతున్నారు. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా గోడ దాటి కిందకు వెళ్ళదని అధికారులు చెబుతున్నారు. మన దేశంలో ఈ స్థాయి డయాఫ్రం గోడ నిర్మాణం ఇదే ప్రథమం. ప్రపంచంలో కూడా ఇదే పెద్దది కావచ్చునని అధికారులు అంటున్నారు. దీని నిర్మాణానికి జర్మనీ సంస్ధను ఒకదానిని రంగంలోకి తెచ్చారు. కనీస అనుభవం ఉన్న కంపెనీ కోసం అన్వేషించి ఈ సంస్థను ఎంపిక చేశారు. ఈ సంస్థ మన దేశంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు భాగస్వామిగా ఉంది. ఈ గోడపై మరో ఆనకట్ట వస్తుంది. అది సుమారుగా 130 అడుగుల ఎత్తు ఉండనుంది. దానిని ఎర్త్‌ అండ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాంగా పిలుస్తున్నారు. డయాఫ్రం గోడ నిర్మాణాన్ని రెండేళ్ళలో పూర్తిచేసి ఆ తర్వాత పై ఆనకట్ట నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే వేసవి లోపు ఇందులో చాలా భాగం పనిని చేపట్టాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ప్రణాళిక రూపొందిస్తున్నారు. మట్టి పని ఇప్పటికే కొంత జరిగింది. యంత్రాలు, పెద్ద టిప్పర్లు తేవడం ద్వారా నవంబర్‌ నుంచి నెలకు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం లక్ష్యం అందుకోవాలని నిశ్చయించారు. అవసరమైన పరీక్షలు పూర్తి చేసి డయాఫ్రం గోడ నిర్మాణం జనవరిలో మొదలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ నిర్మాణ ప్రాంతం వద్ద ఇంకా మూడు గ్రామాల వారిని తరలించాల్సి ఉంది. వారికి అవసరమైన పరిహారం, పునరావాస చెల్లింపులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టిసీమకు సంబంధించి మిగిలిపోయిన పనులు, పోలవరం పనులకు వచ్చే వేసవి ముగిసేలోపు సుమారుగా రూ.2వేల కోట్లు అవసరం అవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఈ బడ్జెట్‌ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు.

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం - మంత్రి దేవినేని

2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం - మంత్రి దేవినేని
Updated :29-10-2015 11:02:35
 విజయవాడ, అక్టోబరు 29 : 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ చెప్పారు. జక్కంపూడిలో పోలవరం కుడికాల్వ పనులను మంత్రి పరిశీలించారు. పట్టిసీమ నుంచి 1500 క్యూసెక్కుల గోదావరి నీరు జక్కంపూడి మీదుగా కృష్ణాలో కలుస్తాయన్నారు. ప్రతిపక్షాలు కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కావాలనే కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు.

Wednesday 7 October 2015

జగన్ దొంగ దీక్షలు మానుకోవాలి : దేవినేని

జగన్ దొంగ దీక్షలు మానుకోవాలి : దేవినేని
Updated :07-10-2015 14:41:44
 పశ్చిమగోదావరి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ దీక్షలు మానుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దీక్షల పేరుతో విద్యార్ధులను రెచ్చగొడితే ప్రభుత్వం ఊరుకోదన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుతో సంబంధం లేనివారితో కలిసి గ్రీన్ ట్రిబ్యునల్‌లో జగన్ కేసు వేయించారన్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ నాటికి పట్టిసీమ పథకం ద్వారా 80 టీఎంసీల నీటిని మళ్లిస్తామన్నారు. పోలవరం అంచనాలకు కేంద్రం ఆమోదం లభిస్తుందని, కొన్ని షరతులతో కాంట్రాక్టు ఏజెన్సీని కొనసాగిస్తామన్నారు. పోలవరం డయా ఫ్రం వాల్వ్ పనిని డిసెంబర్‌లో ప్రారంభిస్తామని, ఈమేరకు విదేశీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

Monday 5 October 2015

పోలవరానికి 30,500 కోట్లు

 హోం >> ఆంధ్రప్రదేశ్ >> ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు
పోలవరానికి 30,500 కోట్లు
Updated :05-10-2015 02:14:58
  • రూ.14 వేల కోట్లు పెరిగిన నిర్మాణ వ్యయం
  • సింహభాగం భూసేకరణ, పునరావాసానికే
  • కాంక్రీటు పనులకు రూ.6,700 కోట్ల అంచనా
  • రూ.1,500-2,000 కోట్లు పెరిగే చాన్స్‌
  • పనుల పర్యవేక్షణకు మేనేజ్‌మెంట్‌ కమిటీ
  • ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సమీక్ష
  • ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత మంత్రివర్గానికి
హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనా రూ.30,500 కోట్లు! ఇందులో ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేవలం రూ.6700 కోట్లు మాత్రమే ఖర్చు కానుంది. కానీ, సింహ భాగం మాత్రం భూ సేకరణ, పునరావాసానికే ఖర్చు కానుంది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనాతో పోలిస్తే రూ.14 వేల కోట్ల వరకు పెరగనుంది. పోలవరం పనులను శరవేగంగా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూచనల మేరకు.. కొత్తగా కలిసిన ఏడు ముంపు మండలాల్లోని గ్రామాలకు పరిహారం, పునరావాసంతోపాటు మిగిలిన కాంక్రీట్‌ పనులకు సంబంధించి తాజా అంచనాలు దాదాపు సిద్ధమయ్యాయి. భూ సేకరణ కోసం ఇప్పటి వరకూ డబ్బులు చెల్లించని, సహాయ పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయని గ్రామాలకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు.
పునరావాస కార్యక్రమాలు చేపడతారు. తాజా అంచనాల్లో సింహభాగం దీనికే కేటాయించారు. జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శనివారం సచివాలయంలో పోలవరం తాజా అంచనాలపై ఆ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో భేటీ అయ్యారు. కొత్త అంచనాలపై సమీక్షించారు. పోలవరం ప్రస్తుత అంచనా రూ.16,010 కోట్లుగా ఉందని, తాజాగా భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, 2015-16 ఎస్‌ఎస్‌ఆర్‌ను పరిగణనలోకి తీసకుంటే రూ.30,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పూర్తిస్థాయి అంచనాలు సోమవారం నాటికి ఖరారవుతాయని చెబుతున్నారు. కాంక్రీట్‌ పనుల్లో అంచనాలు గతంతో పోలిస్తే రూ.1500 కోట్లు నుంచి రూ.2000 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు.
పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు ఇప్పటి వరకూ రూ.7880 కోట్లు ఖర్చు చేశారు. ముంపు మండలాల్లో కొన్ని గ్రామాలకు ఇప్పటికే సహాయ పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు జరిగిపోయింది. ఇక్కడి వారికి గృహ నిర్మాణం నెలాఖరుకు పూర్తవుతుంది. మరో 50,000 ఎకరాల వరకూ భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. వాటికి కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. పునరావాసం పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్రామాలు ఏపీలోకి వచ్చినందున వారికి పునరావాసం ఎక్కడ కల్పించాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పెరిగిన అంచనాల్లో సింహభాగం భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపుల కోసమేనని అధికారులు చెబుతున్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంక్రీట్‌ పనులు మాత్రం మందకొడిగా జరుగుతున్నాయి.
ఏడు శాతం కూడా మించలేదు. ఈ పనుల వేగాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎర్త్‌ డ్యామ్‌, కాంక్రీట్‌ డ్యామ్‌ స్పిల్‌వే, ఎర్త్‌ అండ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, ఎర్త్‌ వర్క్‌ చాలావరకు మిగిలిపోయిందని సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి 12 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీయాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఒక కోటి 70 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వారని, ఇంకా పది కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టిని తవ్వాల్సి ఉందని చర్చకు వచ్చింది. ఎర్త్‌ కాంక్రీట్‌ లైన్‌ స్పిల్‌వే, గేట్ల ఏర్పాటు వంటి పనులు చేయాల్సి ఉందని, వీటిని వేగవంతం చేయాలంటే నెలాఖరుకు భూ సేకరణ, పునరావాస పనులు పూర్తి చేయాల్సిందేనని సమావేశం అభిప్రాయపడింది. ప్రాజెక్టు పనులను నిరంతరం థర్డ్‌ పార్టీ ద్వారా సమీక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ పేరుతో ఒక కన్సల్టెన్సీని వేయాలని నిర్ణయించారు.
ఇవే అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌తో చర్చించిన తర్వాత తుది అంచనాలపై ఒక నిర్ణయానికి వస్తారు. అనంతరం వాటిని ‘ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ కమిటీ (ఐబీఎంసీ) సమీక్షించి స్థిర వ్యయాన్ని అంచనా వేస్తుంది. దానిని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడతారు. మంత్రివర్గ సమావేశం ఆమోదం తర్వాత పనులు త్వరితగతిన చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తారు.