Friday 27 October 2017

పోలవరంపై ఏంచేద్దాం?

పోలవరంపై ఏంచేద్దాం?
28-10-2017 04:02:04

నేడు ముఖ్యమంత్రి నిర్ణయం.. అంచనాలు పెంచలేమన్న గడ్కరీ
 అధిక ధరను రాష్ట్రమే భరించాలని సూచన
 సీఎంకు నివేదించిన జల వనరుల శాఖ
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు చేపట్టిన ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొన్ని పనులు తప్పించి.. ఈ-టెండర్ల ద్వారా వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన ఆయనతో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్‌ఈ రమేశ్‌బాబు తదితరులు భేటీ అయ్యారు. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశ వివరాలను ఆయనకు వివరించారు. శనివారం మరోసారి భేటీ అయి ఏం చేయాలో తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వారితో అన్నారు. ‘ఈపీసీ విధానంలో పోలవరం ప్రాజెక్టుకు తాజా టెండర్లను పిలిస్తే.. అంచనాలను సవరించేందుకు ఆస్కారం లేదు. ఇలా అంచనాలను పెంచితే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుపట్టవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకూ ఆస్కారం లేకపోలేదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకూ సుముఖగా లేం’ అని గడ్కరీ తమకు తేల్చిచెప్పారని అధికారులు సీఎంకు తెలియజేశారు. ‘సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఆర్థిక రంగ నిపుణుడు, రిటైర్డ్‌ బ్యాంకు అధికారితో ఆర్బిట్రేషన్‌ కమిటీ వేయాలని గడ్కరీ సూచించారు. ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి రూ.1000 కోట్ల విలువైన పనుల నుంచి తప్పించి వేరే కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అంగీకరించలేదు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పారు. పైగా.. ట్రాన్‌స్ట్రాయ్‌కే సహకారం అందించాలని, సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు నేరుగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఎస్ర్కో అకౌంట్‌ను తెరవాలని సూచించారు. ఒకవేళ ఈ- టెండర్లను పిలిస్తే.. ట్రాన్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన -14.05 శాతం కంటే ఎక్కువ ధరను చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. అధిక మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేశారు’ అని వివరించారు.

పోలవరంపై దోబూచులు! 8 సీపీఐ నారాయణ
న్యూఢిల్లీ/అమరావతి/హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చారని, ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రం కేంద్రానికి లొంగి ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.