Thursday 12 January 2017

Detailed Project Reports (DPRs)

డీపీఆర్‌ ఉంటేనే.. ప్రాజెక్టులకు అనుమతి!
Sakshi | Updated: January 13, 2017 02:56 (IST)
కొత్త మార్గదర్శకాలు రూపొందించిన కేంద్ర జల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఉంటే అనుమతులు లభించనున్నాయి. డీపీఆర్‌లు సమర్పిస్తేనే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన హైడ్రాలజీ, నీటి పారుదల ప్రణాళిక, డిజైన్లు, అంచనాలకు ఆమోదం తెలుపుతామని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణ అనుమతుల వ్యవధిని గణనీయంగా తగ్గించేందుకు.. ఏళ్లకేళ్లు జాప్యం జరిగి ప్రాజెక్టుల అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఎన్నో అనుమతులు కావాలి..
సాధారణంగా ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జల సంఘం అనుమతి తోపాటు సైట్‌ క్లియరెన్స్, అంతర్రాష్ట్ర వ్యవహారా లు, పర్యావరణ, అటవీ, ప్రణాళికా సంఘం..  అనుమతులు  తీసుకోవాల్సి ఉంటుంది.

అధ్యయన నివేదికలూ ఇవ్వాల్సిందే..
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టు అనుమతులు వేగంగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి తయారు చేసిన డీపీఆర్‌ కచ్చితంగా ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసిన డీపీఆర్‌లో నీటి లభ్యత (హైడ్రాలజీ), నీటి పారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలు, ప్రాజె క్టు డిజైన్లు, నిర్మాణ ప్రణాళిక, అంచనాలు, ఆర్థిక మదింపు వంటి అంశాలపై చేసిన అధ్యయన నివేదికలు పొందుపరచాలి. ఆ డీపీఆర్‌ను సీడ బ్ల్యూసీ పరిశీలించి..అవసరమైన మార్పులు, చే ర్పులు సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మార్పులు చేసి తుది డీపీఆర్‌ రూపొందించాలి. దానిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకు ప్రజెంటేషన్‌ ఇవ్వాలి.

ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ అంగీకారం తెలుపుతుంది. తర్వాత 3 వారాల్లోగా హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక, 2 వారాల్లోగా అంతర్రాష్ట్ర అనుమతులు ఇస్తారు. డిజైన్లకు 2 నెలల గడువు పట్టనుండగా.. అంచనా లు, ఆర్థిక మదింపు, సాంకేతిక సలహా మండలి నివేదిక అనుమతుల ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేస్తారు. ఇక ఆయకట్టు అభివృద్ధి ప్రణాళిక, వ్యయ ప్రయోజనాల నిష్పత్తి (కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో) లను స్పష్టం చేస్తూ వ్యవసాయ శాఖ నుంచి నీటి పారుదల ప్రణాళిక డైరెక్టరేట్‌కు సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. నిర్మాణాలు చేపట్టి ఆపై అనుమతుల అంశాన్ని సాకుగా చూపుతూ, ప్రాజెక్టుల వ్యయాలను పెంచే స్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను పాటిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.