Thursday 31 October 2019

బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలను ఎందుకు తరలించలేక పోయారు?

బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలను ఎందుకు తరలించలేక పోయారు?

1. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు - నగరి ప్రాజెక్టులకు, కె.సి.కెనాల్, చెన్నయ్ నగరం మరియు రాయలసీమ ప్రాంత త్రాగు నీటి అవసరాలకు కృష్ణా నదీ జలాల తరలింపు వీలౌతుంది.

2. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది పరవళ్ళు తొక్కుతూ సముద్రం వైపు పరుగులు పెడుతూనే ఉన్నది. ఆగస్టు 4 వ తేదీకి శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరుకొన్నది. రెండు నెలలుగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా నీటితో తొణికిసలాడుతున్నది. నాలుగు సార్లు గేట్లు ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి దాటుకొని దాదాపు 400 టియంసిల నీరు సముద్రగర్భంలో కలిసిపోయింది. 

3. శ్రీశైలం జలాశయం నుండి 30 రోజుల్లో 114 టియంసిల నీటిని తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరును 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించబడింది. పోతిరెడ్డిపాడు నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా కర్నూలు జిల్లాలో 16.95 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన వెలుగోడు రిజర్వాయరుకు ముందు నీరు చేరుతుంది. వెలుగోడు రిజర్వాయరును ఈ ఏడాది కూడా  నీటితో నింపారు. 

 4. వెలుగోడు నుండి కడప జిల్లాలో నిర్మించబడిన సబ్సిడరీ రిజర్వాయర్స్ బండ్ 'ఎ', బండ్ 'బి' వరకు, అటుపై బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు నీటిని తరలించడానికి 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ నిర్మించబడింది. 

5. తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా 17.74  టియంసిల సామర్థ్యంతో కడప జిల్లాలో నిర్మించబడిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కేవలం 0.8 టియంసిలను మాత్రమే ఈ ఏడాది తరలించారు. ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ 'వెబ్ సైట్' తాజా సమాచారం మేరకు బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 2.62 టియంసిల నిల్వ ఉన్నది. అంటే అంతకు ముందు రిజర్వాయరులో నిల్వ ఉన్న నీటికి ప్రస్తుతం దాదాపు ఒక టియంసి మాత్రమే చేరింది. గతంలో బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో 12, 13 టియంసిలు నిల్వ చేసి పోరుమామిళ్ళ, బద్వేల్ చెరువులకు నీటిని సరఫరా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరి, ఈ ఏడాది ఎందుకు మఠం రిజర్వాయరుకు నీటిని తరలించలేక పోయారు అన్నదే ప్రశ్న. లోపమెక్కడుంది ?

6. కారణాలేంటో తెలుసుకొందామని తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలో పని చేస్తున్న ఇంజనీర్లతో మాట్లాడా. వెలుగోడు రిజర్వాయరు నుండి 3,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే, కర్నూలు - కడప జిల్లాల సరిహద్దు చేరేటప్పటికి 1,800 క్యూసెక్కులు, బండ్ (ఎ), (బి) చేరేటప్పటికి 1300 క్యూసెక్కులు, బి.మఠం రిజర్వాయరుకు 1,019 క్యూసెక్కులు మాత్రమే అంత్యమంగా చేరుతున్నాయని తెలియజేశారు. కారణం, తెలుగు గంగ ప్రధాన కాలువ 98.6 కి.మీ. నుండి అంటే కర్నూలు - కడప జిల్లాల సరిహద్దు నుండి ప్రధాన కాలువకు "లైనింగ్" చేయక పోవడం పర్యవసానంగా నీరు వృధాగా పొలాల్లోకి వెళుతున్నదని చెప్పారు. అంటే, అంత నాసిరకంగా ప్రధాన కాలువను నిర్మించారా! అన్న అనుమానం రాకమానదు. 

7. "లైనింగ్" పనుల కాంట్రాక్టును రు.280 కోట్లకు తీసుకొన్న సి.యం.రమేష్, యాదవ్ లు నిర్మాణ పనులు చేపట్టక పోవడం వల్ల నీరు అందుబాటులో ఉన్నా తరలించుకోలేని దుస్థితి నెలకొన్నదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రధాన కాలువ 'లైనింగ్' పనులకు "రీ టెండరింగ్" పిలవాలని ఆలోచిస్తున్నదని చెప్పారు.

8. కుందూ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల వర్షంపడి వరద వచ్చినప్పుడు 3500 క్యూసెక్కుల వరకు అదే కాలువ గుండా నీరు ప్రవహించింది కదా! అంటే దానికి సరియైన సమాధానం లభించలేదు.  

9. శ్రీశైలం జలాశయం నుండి 29 టియంసిల కృష్ణా వరద నీటిని  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించి కర్నూలు జిల్లాలో 1,08,000 ఎకరాలకు, కడప జిల్లాలలో 1,67,000 ఎకరాలకు, మొత్తం 2,75,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలి. అలాగే 30 టియంసిల పెన్నా నది జలాలను నెల్లూరు జిల్లాలో 2,54,000, చిత్తూరు జిల్లాలో 46,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వాలి. మొత్తం ఆయకట్టు 5,75,000 ఎకరాలు. 

చెన్నయ్ నగరానికి 15 టియంసిల నికర జలాలను త్రాగు నీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. అలాగే రాయలసీమ ప్రాంతం త్రాగు నీటికి కోసం నీటిని తరలించాల్సి ఉన్నది.

10. తెలుగు గంగ ప్రాజెక్టు పరిథిలోని వెలుగోడు రిజర్వాయరులో 16.47 టియంసిలు (గరిష్ట నిల్వ సామర్థ్యం 17.95 టియంసిలు) నిల్వ ఉన్నది. నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు 70 టియంసిలు(గరిష్ట నిల్వ సామర్థ్యం 78 టియంసిలు), కండలేరు రిజర్వాయరుకు 17 టియంసిల(గరిష్ట నిల్వ సామర్థ్యం 68 టియంసిలు) నీరు తరలించబడింది. ఒక్క బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు మాత్రం నీటిని తరలించ లేదు.

11. ప్రభుత్వ అలసత్వానికి, బాధ్యతారాహిత్యానికి, నాసిరకం నిర్మాణాలకు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రబల నిదర్శనంగా నిలిచింది. ప్రాజెక్టు పరిథిలో పంట కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించ లేదు.

12. కృష్ణా నది వరద నీరు దాదాపు 400 టియంసిలు సముద్రం పాలైన పూర్వరంగంలో కూడా కరవు పీడిత ప్రాంతానికి నీటిని తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించ లేదని చెప్పక తప్పదు. 

- టి.లక్ష్మీనారాయణ
నీటి పారుదల రంగ విశ్లేషకులు

Thursday 22 August 2019

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
22-08-2019 12:05:59

అమరావతి: ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ‘‘ప్రభుత్వం దురుద్దేశంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేసింది. కేవలం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న నిర్ణయంతోనే ఈ పనికి పూనుకుంది. కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, మేము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తాం’’ అని ‘నవయుగ’ సంస్థ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి కుదిరిన కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆగస్ట్ 14వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నవయుగ సంస్థ హైకోర్టులో సవాల్‌ చేసింది.

‘మా మాట వినండి! పోలవరం టెండర్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం... పైగా, ఈ సూచన చేసిన 24 గంటల్లోనే రివర్స్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రీటెండర్‌ నోటిఫికేషన్‌తో సహా తమకు అందజేయాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్‌ను కోరిన విషయం విదితమే. పోలవరం ‘రివర్స్‌ టెండర్‌’ ప్రతిపాదనలపై ఆగస్ట్ 13న పీపీఏ అత్యవసర సమావేశం కూడా నిర్వహించింది.

పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసేందుకు, తిరిగి టెండర్లు పిలిచేందుకు ఎటువంటి కారణాలు లేవని... ‘రివర్స్‌’ వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని తేల్చింది. దీనివల్ల సామాజిక-ఆర్థిక పర్యవసానాలు కూడా ఉంటాయని కూడా తెలిపింది. ఇవే విషయాలను వివరిస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఆర్కే జైన్‌ లేఖ రాశారు. రివర్స్‌ టెండర్లపై ముందుకు వెళ్లవద్దని, కనీసం కేంద్రం నుంచి సూచనలు వచ్చేదాకా ఆగాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌పై ముందుకెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా.. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని
Aug 22, 2019, 20:39 IST
 Kodali Nani Slams Chandrababu, Devineni Uma about Palavaram - Sakshi
పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది..

సాక్షి, అమరావతి :  పోలవరంపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చిందే కాని చంద్రబాబు నాయుడు చుట్టాలకు ఆ పనులు అప్పగించాలని చెప్పలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ‍్యానించారు. ఎవరైనా కోర్టుకు వెళితే స్టే ఇవ్వడం సహజమేనని, ఆ మాత్రం దానికే టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు మారితే అంతకు ముందు నిర్మాణ సంస్ధల నుంచి తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే భయం టీడీపీ నేతలకు పట్టుకుందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమా ఏడుస్తున్నారని ఆరోపించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని టీడీపీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అవినీతి నిర్మూలనలో అనేక వత్తిడులు ఎదురవుతున్నాయని గతంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని, సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పోలవరంపై న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.

రాజధానిపై అనవసర రాద్దాంతం
రాజధానిపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అనవర రాద్దాంతం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, రాజధానిని అమరావతి నుంచి తీసివేస్తామని ఆయన చెప్పలేదని స్పష్టం చేశారు. కృష్ణానదికి పెద్దగా వరదలు వచ్చినా, గట్టిగా వర్షాలు కురిసినా అమరావతి మునిగిపోతుందని ఆయన చెప్పారన్నారు. అందులోని లోపాలను గురించి బొత్స వివరించారని పేర్కొన్నారు.  ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో భవన నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశామని, దోచుకున్న వాళ్లు అనుభవించక తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదన్నారు.


పోలవరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: సుజనా
22-08-2019 19:30:07

అమరావతి: పోలవరంపై రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్వాగతించారు. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందని చెప్పారు. ఈ తీర్పుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిస్తున్నామన్నారు. విద్యుత్ ఒప్పందాలు, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలు పాటించి ఉంటే బాగుండేదని సూచించారు. సాక్షాత్తూ జపాన్ ప్రభుత్వం సైతం ఈ ప్రభుత్వ చర్యలు అభివృద్దికి దోహదపడవని లేఖ రాసిందని గుర్తుచేశారు. అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఈ సూచనలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. వ్యక్తిగత అహంభావాలకు, పంతాలకు పోకుండా పోలవరం సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదు: అనిల్‌
22-08-2019 17:43:30

విజయవాడ: హడావుడిగా రూ.220 కోట్ల టెండర్లు వేశారని మంత్రి అనిల్‌ ఆరోపించారు. హడ్కో నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్ల ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. అన్ని వర్గాలవారికీ భవన నిర్మాణ స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులకు ఎక్కడా స్టే ఇవ్వలేదని ఆయన చెప్పారు. రివర్స్ టెండర్లకు వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎందుకంత భయమని ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వం అన్ని విషయాల్లో అవినీతికి పాల్పడిందని, మంత్రి బొత్స సత్యనారాయణ కేవలం శివరామకృష్ణ కమిటీ నివేదికనే గుర్తు చేశారని అనిల్ పేర్కొన్నారు.

పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టేనే ఇచ్చింది: కొడాలి నాని
22-08-2019 17:36:52

అమరావతి: పోలవరంపై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చిందని మంత్రి కొడాలి నాని అన్నారు. అంతేకాని చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదన్నారు. కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలని టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దనేదే జగన్‌ లక్ష్యమని వెల్లడించారు. మంత్రి బొత్స వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై సబ్‌ కమిటీ వేశాం.. దోచుకున్న వాళ్లు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.