Tuesday 9 May 2017

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు

పోలవరం నిర్వాసితులకు 1660 కోట్లు
10-05-2017 04:39:49
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే ప్రథమం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి.. నిర్వాసితులైన పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు మండలాల్లోని 34 గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1660 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. వచ్చేఏడాది గ్రావిటీతో పోలవరంలో నీరు నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున ఇచ్చాం. కొంత మంది రైతులకు వడ్డీతో సహా రూ.10.92 లక్షల చొప్పున ఖాతాలో జమ చేశాం. కుక్కనూరు, వేలేరుపాడు, జీడుగుమల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో 34 గ్రామాల్లోని 14,043 ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఇందుకుగాను నిర్వాసితులకు రూ.1502 కోట్లు చెల్లించాం. అదేవిధంగా 1505 ఎకరాల అసైన్డ్‌ భూములకు సంబంధించి నిర్వాసితులకు రూ.158 కోట్లు చెల్లించాం. మొత్తం నాలుగు మండలాల్లో 15,548 ఎకరాలకు రూ.1660.75 కోట్లు నిర్వాసితులకు చెల్లించాం’ అని వివరించారు.

నష్టపరిహారం చెల్లింపునకు కృషిచేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికారులను అభినందించారు. రైతులకు చెల్లించిన నష్టపరిహారానికి చెందిన బిల్లులను పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖకు, నాబార్డుకు పంపిస్తామని, వాటిని పరిశీలించి కేంద్రం ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వానికి రీయింబర్స్‌ చేస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7500 వందల ఎకరాలకు రూ.800 కోట్లు అవసరమని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. పోలవరం కాంక్రీట్‌, ఎర్త్‌, డయాఫ్రం వాల్‌ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌ టీ-బావర్‌ సంస్థ 633 మీటర్లలో 203 మీటర్ల పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. నవంబరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్‌ ప్రారంభిస్తామని చెప్పారు.