Thursday 14 December 2017

పోలవరంపై విషం చిమ్మొద్దు

పోలవరంపై విషం చిమ్మొద్దు
15-12-2017 02:50:27


రైతు భరోసాను దెబ్బతీయొద్దు
రాష్ట్రానికి నష్టం చేయొద్దు: సీఎం
విమానాశ్రయంలో రైతుల ఘనస్వాగతం
అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వరప్రదాయిని, జీవన రేఖలాంటి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మొద్దని.. రైతాంగం పెట్టుకున్న భరోసాను.. ధైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రానికి.. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని కోరారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి కృష్ణా డెల్టా రైతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనస్వాగతం పలికారు.

సీఎం అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో దాదాపు నాలుగు గంటలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర జల వనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, ఉన్నతాధికారులు, రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ఇందులో పాల్గొన్నారన్నారు. గడ్కరీతో చర్చల తర్వాత పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయగలమన్న భరోసా వచ్చిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేలా విభజన జరిగిందని, కట్టుబట్టలతో వచ్చేశామని గుర్తుచేశారు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై పడిందన్నారు. ‘రాష్ట్ర విభజన జరిగాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇది పూర్తయ్యేలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు నీరందించాలని నిర్ణయించాం. పట్టిసీమను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వారి మాట విని కట్టకుండా ఉంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారేది. దీనిని పూర్తిచేయడం వల్లే ఖరీ్‌ఫలో బ్రహ్మాండమైన పంట దిగుబడులు వచ్చాయి’ అని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పట్టుదలతో పట్టిసీమను పూర్తిచేయడంతో రైతులకు తనపై పూర్తి నమ్మకం కలిగిందన్నారు. ఈ పథకాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే ప్రశ్నించాలని కృష్ణా డెల్టా రైతులకు సూచించారు.

‘ఆంధ్రజ్యోతి’ వార్త చదివాక గుండె బరువెక్కింది
పోలవరం టెండర్లను ఆపాలని కేంద్రం ఆదేశించినట్లు పేపర్లో వచ్చిన వార్తను చదివాక గుండె బరువెక్కిందని ముఖ్యమంత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. దక్షిణ కొరియా నుంచే గడ్కరీతో ఫోన్లో మాట్లాడానని, మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిపారు. ప్రాజెక్టు సమస్యలపై బుధవారం గడ్కరీతో సంపూర్తిగా చర్చించామని.. కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ప్రస్తుత కాంట్రాక్టు సంస్థకు నెల రోజులు గడువిచ్చారని.. లక్ష్యాలను చేరుకోలేకపోతే.. మర్నాడే కొత్త సంస్థకు కాంక్రీట్‌ పనుల బాధ్యతను అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.

కొంతమంది కావాలనే పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘2013 భూ సేకరణ చట్టం అమల్లోకి రాకముందే భూసేకరణ చేపట్టి ఉంటే.. రూ.2900 కోట్లు వ్యయమయ్యేది. ఇప్పుడా చట్టం అమల్లోకి రావడంతో.. భూ సేకరణ వ్యయం 11 రెట్లు పెరిగి రూ.33,000 కోట్లకు చేరుకుంది.

ప్రధాన పనుల వ్యయం మాత్రం రెండింతలు పెరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ప్రతిపక్షాలు అవినీతి జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులు.. రాష్ట్రం చేసిన వ్యయాలు.. ఏ కాంట్రాక్టు సంస్థకు ఎంత చెల్లింపులు జరిపారో ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు ఉంటాయి. శ్వేతపత్రాన్ని కోరుతున్న వారు ఆన్‌లైన్‌లోనే లెక్కలు చూసుకోవచ్చు. ప్రతిపక్షాలు విజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర రాద్ధాంతం సృష్టించి అన్యాయం చేయొద్దు’ అని కోరారు.

కంకుల సందడి..
తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు విమానాశ్రయంలో సందడి చేశారు. పట్టిసీమ నీటితో పండించిన పంటను తీసుకువచ్చి కంకుల దండను సీఎం మెడలో వేశారు. డప్పు వాయిద్యాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మారుమోగింది. సీఎంకు స్వాగతం పలికినవారిలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్‌, బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.

గడ్కరీ రాక 23న
కాగా.. పోలవరం సందర్శనకు గడ్కరీ ఈ నెల 23న రానున్నారు. తొలుత ఆయన పర్యటన 22న ఉంటుందని భావించారు. అయితే.. 23న విజయవాడకు వస్తారని.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పనులను సమీక్షిస్తారని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.