Friday, 18 September 2015

400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి

400 టీఎంసీలు.. 40 లక్షల ఎకరాలు టార్గెట్ గోదావరి

Updated : 7/17/2015 3:06:55 AM
Views : 3833

kcr-traget


- ప్రాజెక్టులన్నీ రీడిజైన్
- బాధ్యతలు వ్యాప్కోస్ సంస్థకు అప్పగింత
- ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు
- రెండు భాగాలుగా ప్రాణహిత ప్రాజెక్టు
- తుమ్మిడిహట్టి, కాళేశ్వరంలో వేర్వేరు ప్రాజెక్టులు
- కంతనపల్లి ప్రాజెక్టు స్థలం మార్పు
- గోదావరిలో తెలంగాణకు 953 టీఎంసీల హక్కు
- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి
- గోదావరి నది ప్రాజెక్టులపై ఆరు గంటలు సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గోదావరి నదీజలాల మీద ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు తోడు అదనంగా 400 టీఎంసీల జలాలు వినియోగించుకుని రాష్ట్రంలో మరో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తుమ్మిడిహట్టినుంచి ప్రారంభించి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెందాకా ప్రతి ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని సూచించారు. ప్రాణహిత ప్రాజెక్టును రెండు భాగాలు చేసిన తుమ్మిడిహట్టి వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద మరో ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్‌తోపాటు నల్లగొండ కరువుప్రాంతాలకు కూడా నీరందించాలని నిర్దేశించారు.

kcr-traget2

గోదావరి నదీ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ రీ డిజైన్ చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్)ను సీఎం కోరారు. గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ గురువారం ఆరు గంటలకుపైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గూగుల్ ఎర్త్ ఫొటోలు, వివిధ ప్రాజెక్టుల మ్యాపులు ముందు పెట్టుకుని ఆయా ప్రాజెక్టులపై వివరంగా చర్చించారు. నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, ఈఎన్‌సీ విజయప్రకాశ్, నీటిపారుదల శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వ్యాప్కోస్ జీఎం శంభు ఆజాద్, ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నియోజకవర్గానికి లక్ష ఎకరాలు: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గోదావరి బేసిన్‌లోని 54 నియోజకవర్గాల్లో నాలుగు అర్బన్ నియోజకవర్గాలు పోగా మిగిలిన 50 నియోజకవర్గాలకు సగటున లక్ష చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెంలాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పడు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మిగిలిన 40 లక్షల ఎకరాలకు 400 టీఎంసీల నీటిని అందించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. లక్ష్య సాధనకు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి విస్తరించాలి అని అధికారులకు సూచించారు.

వ్యాప్కోస్‌కు బాధ్యతలు: గోదావరి జలాలలో రాష్ర్టానికున్న వాటా నీటిని సంపూర్ణంగా, సమర్థంగా వాడుకునేలా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని సీఎం కోరారు. సమైక్య రాష్ట్రంలో గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, వాటి డిజైన్లు కూడా సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహట్టి నుంచి మొదలుకుని ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం వరకు ప్రతీ ప్రాజెక్టునూ రీ డిజైన్ చేయాలని ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల కోసం 400 టీఎంసీల నీరు ఇప్పటికే కేటాయింపులున్నాయని, ఈ కేటాయింపులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రస్తుతమున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు అనుగుణంగా డిజైన్లు రూపొందించాలని, వీలైనంత తర్వగా డిజైన్లు ఇవ్వాలని వ్యాప్కోస్‌ను సీఎం కోరారు.

తెలంగాణకు 953 టీఎంసీల హక్కు ఉంది...


రాష్ట్రంలో ప్రవహించే గోదావరి జలాల్లో మనకు 953 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది.. అయితే 433 టీఎంసీల కోసమే ప్రాజెక్టులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఇంకా 521 టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టీఎంసీలు వాడుకునే హక్కు, అనుమతులు వచ్చాయి.

వీటికి అనుగుణంగా ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవు. అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు తదితర అడ్డంకులు ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందించారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావద్దనే దురుద్దేశమే పాలకులకు ఉండేది. అందుకే తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులకు అతీగతీ లేకుండాపోయింది. ఇప్పుడు మనం వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సమర్థంగా నీటిని వినియోగించే విధంగా డిజైన్లు తయారు చేయాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న వ్యాప్కోస్‌కే ఆ బాధ్యత అప్పగిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రాణహిత డిజైన్ పనికొచ్చేది కాదు..


ప్రాణహిత-చేవెళ్ల పేరు మీద కాలయాపన చేశారని, అసలు ఇప్పుడున్న డిజైన్ పనికొచ్చేది కాదని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. దానిని రెండు భాగాలు చేయాలి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వాలి. అలాగే కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరివ్వాలి. అదే ప్రాజెక్టును నిజాంసాగర్‌కు, ఎస్సారెస్పీకి అనుసంధానం చేయాలి అని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు కూడా నీరు అందించలేకపోతున్నది. 170 రోజులు లిఫ్టు చేయాల్సి ఉన్నా, 90 రోజులు కూడా నీటిని లిఫ్టు చేయలేకపోతున్నారు. దేవాదుల వద్ద నీటి నిల్వ ఉండడం లేదు. అందుకే కంతనపల్లి ప్రాజెక్టును దేవాదులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలి.

ఇప్పుడు కంతనపల్లి కోసం ప్రతిపాదించిన స్థలం వద్ద కాకుండా కొంచెం ముందుకు ప్రాజెక్టు కడితే, దేవాదులకు ఉపయోగం. గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే క్రమంలో దారి మధ్యలో ఎక్కువ రిజర్వాయర్లు ఉండాలి. గ్రావిటీ కమ్ లిఫ్టు పద్ధతిలో నీటి పారకం ఉండాలి. అవసరమైన చోట ఎస్సారెస్పీ క్యారీయింగ్ సామర్థ్యం పెంచాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలి అని సీఎం అధికారులకు సవివరంగా దిశానిర్దేశం చేశారు. మన ప్రాధాన్యాలతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

గూగుల్ మ్యాప్ సహాయంతో చర్చ..


గోదావరిపై ఎక్కడెక్కడ లిఫ్టులు పెట్టాలి? ఎక్కడ ఎన్ని టీఎంసీలు వాడాలి? ఎక్కడ ఎంత నీటి ప్రవాహ ఉధృతి ఉంటుంది? ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీరు తీసుకోవాలి? ఇప్పటికే తవ్విన కాల్వలు, తీసిన సొరంగాలు, వేసిన పైపులైన్లను ఎలా ఉపయోగించాలి? ఎక్కడ నుంచి ఎక్కడి వరకు లిఫ్టు ద్వారా అందించాలి? ఎక్కడ గ్రావిటీ ద్వారా ఇవ్వాలి? ఎక్కడ కాల్వలు తవ్వాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడ కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యం ఎంత పెంచాలి? తదితర అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదికల ఆధారంతో సీఎం అధికారులతో విస్తృతంగా చర్చించారు.

No comments:

Post a Comment