పట్టిసీమను అడ్డుకోండి గోదావరి బోర్డుకు టీ సర్కారు ఫిర్యాదు Updated :09-07-2015 02:44:45 |
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలవరించాలని గోదావరి నది నిర్వహణ బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దీనిని నిర్మిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. ‘పోలవరం దిగువ భాగంలో కుడి ప్రధాన కాలువ నుంచి 80 టీఎంసీల వరద నీటిని కృష్ణా నదికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతలను ఈపీసీ విధానంలో ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84(3)(2)ను, సెక్షన్ 85(డీ) పేరా 7ను ఉల్లంఘించడమే. ప్రాజెక్టు చేపట్టేముందు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కూడా ఉల్లంఘించింది. ఏపీ సర్కారు నిర్ణయం చట్టవిరుద్ధం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున గోదావరి మిగులు జలాల వినియోగం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సి ఉంది. వీటి విషయంలో ఎలాంటి పంపకాలు జరగకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు లేదు’ అని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
|
No comments:
Post a Comment