Wednesday, 16 September 2015

నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం వితండవాదం

    హైదరాబాద్:కృష్ణా జలాలు, నాగార్జునసాగర్ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల రంగం) ఆర్ విద్యాసాగర్‌రావు విమర్శించారు. నీటి వాటాల జోలికివెళ్లకుండా అవసరాల ప్రకారం నీటి పంపకం జరగాలని వింత వాదన చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. నీటి వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనలను లెక్కలతో సహా తిప్పికొట్టారు. ట్రిబ్యునల్, కోర్టు తీర్పులను పట్టించుకోవడంలేదని, ఇప్పటికే ఏపీ తనకు కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటినే వినియోగించుకుందని స్పష్టం చేశారు. R-Vidyasagarrao బచావత్ ట్రిబ్యునల్ గత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలని ఆయన చెప్పారు. ట్రిబ్యునల్ అనుమతించిన ఆయా ప్రాజెక్టుల నీటి అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అనుమతించిన పరిమాణాలను కలిపి గుండుగుత్తగా రాష్ర్టానికి ఈ మొత్తం కేటాయింపు జరిగిందని తెలిపారు. అయితే 811 టీఎంసీలు మించకుండా ఆయా ప్రాజెక్టులకు అనుమతించిన పరిమాణాలలో మార్చుకునే వెసులుబాటును ట్రిబ్యునల్ తుది తీర్పులోని క్లాజ్ 15లో కల్పించారని చెప్పారు. ఆ వెసులుబాటు పుణ్యమా అని గత ప్రభుత్వాలు కేసీ కాలువకు అనుమతించిన పరిమాణంలో 8 టీఎంసీలు కుదించి, రీజనరేషన్ తాలూకు 11 టీఎంసీలను జోడించి, వెరసి 19 టీఎంసీల వినియోగంతో శ్రీశైలం కుడి కాలువకు నికర జలాలను కేటాయించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టా ఆధునీకరణ మూలంగా 29 టీఎంసీలు మిగులుతాయని లెక్కలుకట్టి అందులో 20 టీఎంసీలను భీమాకు, మరో 9 టీఎంసీలను పులిచింతలకు కేటాయించడం జరిగిందని విద్యాసాగర్‌రావు చెప్పారు. దీన్నిబట్టి స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. గత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు.. అంటే 811 టీఎంసీల పరిమాణం మాత్రమే నిలకడగా, నిశ్చలంగా ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు కూడా తన తుది తీర్పులో కచ్చితంగా ఇంత నీరు అని కేటాయింపు (స్పెసిఫిక్ ఎలకేషన్) జరపలేదు. బచావత్ ట్రిబ్యునల్ గత ఉమ్మడి రాష్ర్టానికి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణ ప్రాజెక్టులకు సంక్రమించే హక్కు 299 టీఎంసీలు. మిగిలిన 512 టీఎంసీలు ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుంది. ఈ విషయం అనేక జీవోలలో, పుస్తకాల్లో పొందుపరిచి ఉన్నది అని ఆయన వివరించారు. 230 టీఎంసీలు తెలంగాణకు.. 322.80 టీఎంసీలు ఆంధ్రాకు.. గత ఏడాది జూన్ ఒకటినుంచి ఇప్పటివరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి ప్రధాన కృష్ణానది, దాని ఉప నదుల నుంచి నికరంగా చేరిన మొత్తం నీరు (ప్రాజెక్టులు వినియోగించుకున్న నీరు, ఆవిరి, ఇతర నష్టాలు మినహాయించి) 552.8 టీఎంసీలు. ఇందులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ అనుమతించిన ప్రాజెక్టుల వినియోగం ప్రకారం 41.61 శాతం తెలంగాణకు, 58.39 శాతం ఆంధ్రాకు లభ్యమవుతుంది. అంటే 230 టీఎంసీలు తెలంగాణకు, 322.80 టీఎంసీలు ఆంధ్రాకు చెందుతాయి. వాస్తవాలు ఇలా ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో లభ్యమయ్యే నీటిలో సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టు అవసరాలనుబట్టే నీటి పంపకం జరపాలని, సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టుల వినియోగ ప్రసక్తి లేవనెత్తవద్దని ఆంధ్రా వాదిస్తున్నది. ఈ వాదన ఎంత వరకు సహేతుకమైందో విజ్ఞులే నిర్ణయించాలి అని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు అనుమతించిన నీటిని, ఆయా ప్రాజెక్టులలో వినియోగించుకోకుంటే, ఆ నీటిని వేరే ప్రాజెక్టుల్లో ఉపయోగించుకోకూడదా? అని విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుకు నిర్ణయించిన నీటిని అక్కడ వాడుకోకపోతే వేరే వాడుకోవడానికి వీల్లేదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. తెలంగాణకు చెందిన జూరాల, భీమా, కోటిపల్లివాగు, ఊకచెట్టువాగు, డిండి, కోయల్‌సాగర్ ఇంకా చిన్ననీటి ప్రాజెక్టులు కలిపి 88.60 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఉంది. వివిధ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం 78 టీఎంసీల నీటిని వినియోగించుకోలేకపోయింది. అలా వినియోగించుకోలేని నీటిని నాగార్జునసాగర్‌లో పదిల పర్చుకుని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రబీకి వాడుకుంటామని తెలంగాణ చెబుతుంటే, అలా కుదరదని వాదిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం దానికి కారణాలు మాత్రం చెప్పటం లేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు సంక్రమించిన నీటి పరిమాణం మొత్తాన్ని ఎక్కడైనా, ఏ ప్రాజెక్టులోనైనా వాడుకునే హక్కును బచావత్ ట్రిబ్యూనల్ క్లాజ్ 15లో కల్పించిందని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. అనుమతించిన ప్రాజెక్టుల్లో మాత్రమే అనుమతించిన నీటినే వాడుకోవాలని వాదిస్తున్న ఆంధ్ర.. ఎలాంటి అనుమతులు లేని హంద్రీనీవా, తెలుగుగంగకు నీటిని తరలించటాన్ని ఎలా సమర్థించుకుంటుందని ఆయన నిలదీశారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తయితే తప్పా భీమాకు నీరు ఇవ్వటం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం ఏ లేఖలో.. ఏ రిపోర్టులో ఆ విషయం చెప్పిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాకు అవసరమైన 18120టీఎంసీల నీటిలో 18.90టీఎంసీలు మాత్రమే సాగర్ దిగువ నుంచి వస్తుంది కనుక మిగిలిన 162.3టీఎంసీల నీటిని సాగర్ నుంచి వదలాలని ఆంధ్రప్రదేశ్ మొండి వాదన చేస్తున్నది. నిన్నటి వరకు మీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు డెల్టా కోసం సవరించిన నీటి అనుమతి 152.20 టీఎంసీలు. ఇందులో 101.20 టీఎంసీలు సాగర్ దిగువన లభ్యమవుతాయి. ఈ లెక్కన 51 టీఎంసీలు డెల్టాకు, 9 టీఎంసీలు పులిచింతలకు.. మొత్తం 60టీఎంసీలు ఇస్తే సరిపోతుంది. అదీకాక డెల్టాకు అవసరమైన 181.2టీఎంసీల్లో 80టీఎంసీలు సాగర్‌నుంచి వదలాలని.. 101.20టీఎంసీలు దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గల పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. ఇంత చేసి.. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు అని విద్యాసాగర్‌రావు విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలాడటం తగదని ఆయన ఏపీకి హితవు పలికారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే నాగార్జునసాగర్‌లో నిల్వ చేసిన నీటిపై కృష్ణా డెల్టాకు ఎలాంటి హక్కు లేదు. ఎగువ, దిగువ నుంచి లభించే ఫ్రీ సప్లయిలను మాత్రమే వాడుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టు పేర్కొంటున్నది. కృష్ణా డెల్టాలో సాగర్ దిగువన లభించిన నీటి పరిమాణం 108టీఎంసీలు.. అంటే 101.20టీఎంసీల కంటే ఏడు టీఎంసీలు ఎక్కువ. ఈ డేటా కూడా 1972-73నుంచి 2007-08వరకు పరిగణలోకి తీసుకుంది. ఇప్పటి వరకు కృష్ణా డెల్టాకు వాడిన నీరు 167టీఎంసీలు. ఇందులో సాగర్‌నుంచి 131.50టీఎంసీలు, దిగువన లభించిన నీరు 36టీసీఎంలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు 18.90టీఎంసీలు మాత్రమే వస్తాయని ఆంధ్రప్రదేశ్ వాదించి ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నట్లు? నివేదికలు, రిపోర్టులు స్పష్టంగా చెబుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టుకు వెళతామని చెబుతున్నారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు అని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment