Friday, 18 September 2015

గోదావరిపై కొత్త ప్రాజెక్టులు

గోదావరిపై కొత్త ప్రాజెక్టులు

Posted On 63 days 15 hours 3 mins ago
గోదావరిపై కొత్త ప్రాజెక్టులు
- పూర్తి హక్కు మేరకు వినయోగం
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో
               గోదావరి నది పై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి ప్రాజెక్టులపై గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 953 టీఎంసీలు. మనకు ఈ స్థాయిలో జలాలు వాడుకునే హక్కు ఉన్నా.. 433 టీఎంసీలు మాత్రమే వాడుకునే ప్రాజెక్టులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా 521 టీఎంసీలు వాడుకునేందుగా వీలుగా గోదావరిపై ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. వీటిలో ఇప్పటికే 400 టీఎంసీలు వాడుకునేందుకు మనకు అనుమతులు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. '' అని అన్నారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో గోదావరి జలాల వినియోగంతో పాటు వివిధ ప్రాజెక్టుల స్థితిగతుల గురించి అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా అప్పటి పాలకులు నిర్ణయాలు తీసుకున్నారని దీని వల్ల ఏళ్ల తరబడి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరాష్ట్ర వివాదాలు, భూ సేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు రూపొందించి, అరకొరగా నిధులు విడుదల చేయడం వల్ల నష్టం జరిగిందని, ప్రాజెక్టుల నుంచి నీరు అందలేదని తెలిపారు. గోదావరి బేసిన్‌ లో తెలంగాణలో 50 నియోజకవర్గాలున్నాయని ఈ నియోజక వర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు ప్రస్తుతమున్న ప్రాజెక్టులకనుగుణంగా డిజైన్లు రూపొందించాలని ప్రముఖ కన్సల్టెన్సీ వ్యాప్కోస్‌ను ముఖ్యమంత్రి కోరారు.

No comments:

Post a Comment