Wednesday, 16 September 2015

అబద్ధాల పట్టిసీమ !

అబద్ధాల పట్టిసీమ !

Updated : 9/2/2015 2:00:52 AM
Views : 699
-నికర జలాల పోలవరంలో అంతర్భాగమని కేంద్రానికి వివరణ
-మిగులు జలాలంటున్న జనవరి నాటి పట్టిసీమ జీవో
-ఏపీ వివరణను తెలంగాణకు పంపిన కేంద్రం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టిసీమపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని వాదించిన చంద్రబాబు, జనవరిలో విడుదల చేసిన జీవోలో దీన్ని మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నికరజలాల ఆధారంగా నిర్మిస్తున్నారు. అందులో పట్టిసీమ అంతర్భాగమే అయిన పక్షంలో అదీ నికర జలాలతో నిర్మించాలి. కానీ జనవరినాటి ఏపీ ప్రభుత్వ జీవోలో అది కాస్త మిగులు జలాల ప్రాజెక్టుగా బయటపడింది. దీన్నిబట్టి పట్టిసీమకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధం లేదని అర్థమవుతుంది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను అక్రమ ప్రాజెక్టులంటూ గతంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

దీనిపై కేంద్రం వివరణ కోరగా వివిధ అంశాలను పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం వివరణ పంపించింది. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం 12 లేఖలు రాసిన దరిమిలా తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరి, బదులు తెప్పించుకుంది. ఏపీ సర్కారు పంపిన వివరణ లేఖను ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. అందులో పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని, ముఖ్యంగా నదుల అనుసంధానంలో భాగంగా తమ సొంత ఖర్చుతో దీనిని చేపడుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం బుకాయించింది. అయితే పోలవరం ప్రాజెక్టు నికరజలాలపై ప్రతిపాదించిన ప్రాజెక్టు కాగా... పట్టిసీమ మిగులు జలాలపై చేపడుతున్నది. పట్టిసీమకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటిన జారీ చేసిన జీవోలోనే ఈ విషయం స్పష్టంగా పేర్కొంది.

పార్లమెంటులో ప్రకటించినా పట్టదు...


మరోవైపు పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని కేంద్రమంత్రి పార్లమెంటులోనే ప్రకటించారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, కంబంపాటి హరిబాబు పోలవరంపై అడిగిన ప్రశ్నకు జులై 23న కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అందులో పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు... ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అందలేదు అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సమాధానం వచ్చిన పదిహేను రోజులకే (05.08.2015) ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్రానికి పంపిన లేఖలో పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమంటూ బుకాయించడం విచిత్రం.

No comments:

Post a Comment