జలం.. జగడం!
September 09, 2013
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంపై ప్రధాన చర్చ జరుగుతోంది. ఇందులో శ్రీశైలం రిజర్వాయర్ పాత్ర చాలా కీలకం. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం నీటి వినియోగం ప్రధానాంశం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడే కృష్ణా జలాల వినియోగ మండలి కేటాయింపుల ఆధారంగానే నికర/మిగులు జలాలను అన్ని రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. విభజన తర్వాత కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుదారులకు ప్రస్తుతమున్న స్వేచ్ఛ ఉండకపోవచ్చు. వీరి అధిక వినియోగాన్ని కట్టడి చేస్తే.. తమకు కృష్ణా నీళ్లు దొరుకుతాయన్నది రాయలసీమ వాసుల వాదన.
కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్‌లకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే నీటిని విడుదల చేస్తే.. కృష్ణా మిగులు జలాల ఆధారంగా చేపట్టిన వెలిగొండ (ఆంధ్ర), గాలేరు-నగరి, హంద్రి-నీవా (రాయలసీమ), ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు (తెలంగాణ) ప్రాజెక్టులకు కచ్చితంగా మిగులు జలాలు లభ్యమవుతాయని నీటిపారుదల రంగ నిపుణులు కూడా వాదిస్తున్నారు.
ఈ ఆరు ప్రాజెక్టులకు 198.50 టీఎంసీల కృష్ణా జలాలు కావాల్సి ఉంది. ఈ నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి భవిష్యత్తులో పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకే శ్రీశైలం ప్రాజెక్టు వ్యవహారం అత్యంత సున్నితాంశంగా మారింది. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా నదిపై తెలంగాణ ఎగువ రాష్ట్రంగా, సీమాంధ్ర దిగువ రాష్ట్రంగా మారతాయి. ప్రస్తుతం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మహారాష్ట్ర, కర్ణాటకల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనే.. భవిష్యత్తులో తెలంగాణ, సీమాంధ్రల మధ్య తెరపైకిరావచ్చు. కృష్ణా నికర జలాల (75% లభ్యత ఆధారంగా లెక్కగట్టిన 811 టీఎంసీలు) వినియోగం విషయంలో బచావత్ ట్రిబ్యునల్ గతంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల వారీగా కచ్చితమైన కేటాయింపులను చేసింది.
ఈ కేటాయింపులను మార్చే అధికారం ప్రస్తుత బ్రిజే ష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కూడా లేదు. అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకూ ఆ కేటాయింపులను మార్చే అధికారం ఉండదు. ప్రస్తుత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేవలం మిగులు జలాల (65% లభ్యత ఆధారంగా లెక్కగట్టినవి) పంపిణీపైనే దృష్టి పెట్టింది. ఇందులో రాష్ట్రానికి 198.50 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది.
మిగులు జలాల ఆధారంగా చేపట్టిన వెలిగొండకు 43.50 టీఎంసీలు, హంద్రి-నీవాకు 40 టీఎంసీలు, గాలేరు-నగరికి 38 టీఎంసీల వంతున మొత్తం 121.50 టీఎంసీల నీరు కావాలి. అలాగే తెలంగాణకు చెందిన ఎస్ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 25 టీఎంసీలు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 22 టీఎంసీలు కలిపి మొత్తం 77 టీఎంసీలు కావాలి. బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల ప్రకారం నది పరీవాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే.. ఇంకా నీళ్లు(నికర/మిగులు) మిగిలి ఉంటేనే మిగతా అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. దీని ప్రకారం కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉండే ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల అవసరాలకు ముందుగా కేటాయింపులు జరగాల్సి ఉంటుంది.
పరీవాహక ప్రాంతం బయట ఉన్న వెలిగొండ, హంద్రి-నీవా, గాలేరు-నగరిలకు ఆ తర్వాతే కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. ఈ సూత్రం ప్రకారం ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడులకు కావాల్సిన 77 టీఎంసీల్లో పోలవరం కుడి కాల్వద్వారా లభించే 45 టీఎంసీలు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జూరాలకు కేటాయించిన 9 టీఎంసీలు, నాగార్జునసాగర్/శ్రీశైలంలకు క్యారీ-ఓవర్ కింద కేటాయించిన 30 టీఎంసీలలో 23 టీఎంసీలను కేటాయించవచ్చు.
ఇక సంక్షోభ సంవత్సరాల్లో కృష్ణా ఆయకట్టుదారుల భవిష్యత్తు అవసరాల కోసం క్యారీ-ఓవర్ కింద నాగార్జునసాగర్‌కు కేటాయించిన 120 టీఎంసీలను వెలిగొండ, హంద్రి-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతోనే చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేటాయింపులు చేసినా కృష్ణా డెల్టా ఆయకట్టుదారులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, డెల్టా అవసరాలకు వెన్నుదన్నుగా ఉండటం కోసం పోలవరం కుడి కాల్వ, పులిచింతల ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు కాబట్టి.. ఆంధ్రా రైతులు భయపడాల్సిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 160 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున.. ఆ నీటితో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టుదార్లకు అదనపు హామీ ఉంటుందని, టెయిల్‌పాండ్ ద్వారా కృష్ణాలో మిగిలే నీళ్లను మూడు ప్రాంతాల్లోని మిగులు జలాల ప్రాజెక్టులకు విడుదల చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కృష్ణా జలాల వినియోగంపై భవిష్యత్తులో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పడే బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ మాజీ అధ్యక్షుడు, నీటిపారుదల రంగ నిపుణుడు జి.ప్రభాకర్ సూచించారు. నైలునదీ జలాల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన బోర్డుకు ఉన్నట్టుగానే.. కృష్ణా జలాల పంపిణీ పర్యవేక్షణ బోర్డుకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే విధంగా విభజన సమయంలోనే కేంద్రంపై అన్ని ప్రాంతాల నేతలు ఒత్తిడి తేవాలన్నారు. తుంగభద్ర బోర్డుకు న్యాయాధికారాలు లేనందువల్లే.. దాని నిర్ణయాలకు కర్ణాటక తిలోదకాలిస్తోందని అన్నారు. సంక్షోభ సంవత్సరాల్లో కృష్ణా జలాల వినియోగంపై విభజన సమయంలోనే నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి.. ఒక కట్టుదిట్టమైన ఫార్ములాను తయారు చేసుకోవాలన్నారు.
S. NO | Project | Region | Venue | Ayacut Lk / Acres | Requirement in TMCs | Allot ment in TMCs |
1 | Veligonda | Andhra | Near Markapur, Prakasham Dist. | 4.47 | 43.50 | 0.00 |
2 | Handri - Neeva Sujala Sravanthi project | Rayalaseema | Kurnool, Anatapur, Chittoore | 6.00 | 40.00 | 0.00 |
3 | Galeru - Nagari | Rayalaseema | 2.60 | 38.00 | 0.00 | |
4 | Teluguganga | Rayalaseema | Kurnool, Kadapah, Chittoore, Nellore | 5.23 | 29.00 | 25.00 |
5 | SRBC | Rayalaseema | Kurnool Kadapah | 2.50 | 19.00 | 19.00 |
6 | SLBC | Telangana | Mahaboobnagar Nalgonda | 3.70 | 30.00 | 0.00 |
7 | Kalwakuthy | Telangana | Mahaboobnagar Dist. Kalwakuthy, Kollapur | 3.40 | 25.00 | 0.00 |
8 | Nettempadu | Telangana | Mahaboobnagar dist. Alampur, Gadwal | 2.00 | 22.00 | 0.00 |
No comments:
Post a Comment