Tuesday 15 February 2022

నదుల అనుసంధానం డేంజర్‌ - రాజేంద్రసింగ్‌

 నదుల అనుసంధానం డేంజర్‌

నీళ్లపై, నదులపై రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే ఆ పథకం ఉద్దేశం

VDO.AI

నీటి ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణే  దాని లక్ష్యం.. నదుల పునరుజ్జీవనం జరగాలివాటితో ప్రజల్ని అనుసంధానించాలి.. వాణిజ్య పంటలతోనే కావేరిలో నీటి కొరతతెలంగాణలో వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌అదే జరిగితే సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది

‘ఆంధ్రజ్యోతి’తో ఇంటర్వ్యూలో వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానం దేశానికి మంచిది కాదని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె పురస్కార గ్రహీత రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. రాష్ట్రాలకు నీళ్లపై, నదులపై ఉన్న హక్కులను లాక్కొని బడా వర్గాలకు కట్టబెట్టడానికే నదుల అనుసంధానం వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నదులపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో వివరాలు వెల్లడించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. 

ఆంధ్రజ్యోతి: ఏటా గోదావరిలో మూడువేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కావేరిలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు నదుల అనుసంధానం పరిష్కారం కాదా?రాజేంద్రసింగ్‌: కాదు. ఎందుకంటే నదుల అనుసంధానమే తప్పు. నదుల అనుసంధానం పేరిట పనులు చేపడితే ఇదివరకే ఉన్న నదులన్నీ దెబ్బతింటాయి. నదులపై, నీళ్లపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కాలరాయడమే ఆ పథకం లక్ష్యం. నదులపై హక్కులను బడాబాబులకు అప్పగించాలనే కుట్ర నదుల అనుసంధానంలో ఉంది. నదుల సహజత్వం ఈ పథకం వల్ల దెబ్బతింటుంది. ఎక్కడికక్కడ నీటి వనరులను కాపాడుకుంటూనే భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక కావేరీలో నీటి కొరతకు ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న వాణిజ్య పంటలే. ఒక టీఎంసీ నీటితో తెలంగాణలో 12 వేల ఎకరాలు సాగవుతుండగా... కావేరీ పరివాహక ప్రాంతంలో ఒక టీఎంసీతో మూడువేల ఎకరాలు మాత్రమే సాగయ్యే పంటలు పండిస్తున్నారు.  

నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో మీరు కూడా సభ్యులే కదా?ఒకప్పుడు నేను కూడా ఆ కమిటీలో సభ్యుణ్ని. అయితే నాకిచ్చిన పత్రాలన్నీ తీసి... పక్కన పడేశా. నదుల అనుసంధానం వద్దని తొలి నుంచి వాదిస్తూనే ఉన్నా. నీటిని ప్రైవేటీకరించి, వ్యాపారం చేయాలనే లక్ష్యాలు నదుల అనుసంధానం వెనుక ఉన్నాయి. నదుల అనుసంధానంతో సామాజిక, ఆర్థిక, సాంస్కతిక అంతరాలు ఏర్పడి, దేశం సంక్షోభంలోకి వెళుతుంది. నీటి ప్రైవేటీకరణలో భాగమే ఈ పథకం. నదుల అనుసంధానం కాదు. నదులతో ప్రజలను అనుసంధానించాలి.  నదుల అనుసంధానం లేకపోతే కరువు ప్రాంతాల్లో అభివృద్ధి ఎట్లా?నీళ్లు అవసరమే.. కానీ అత్యాశ పనికిరాదు. గంగా మాయీ (గంగమ్మ) కమాయి (ఆదాయం) కారాదు. గంగానది 11 రాష్ట్రాలు, పలు దేశాల్లో ప్రవహిస్తుంది. గంగానది అనుసంధానం ప్రతిపాదించినా జరగలేదు. రాజస్థాన్‌లో తక్కువ వర్షపాతం ఉంది. ఆ రాష్ట్రంలో 12 నదుల పునరుజ్జీవనం చేశాం. ఆ పని దేశమంతా జరగాలి. స్థానికంగా ఉన్న నదుల పునరుజ్జీవనం జరగాలి. వాణిజ్య పంటల సాగు కూడా నీటి సంక్షోభానికి కారణం. ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి.  

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే గెజిట్‌పై మీ అభిప్రాయమేంటి?రివర్‌ బేసిన్‌ అథారిటీ బిల్లు, డ్యామ్‌ సేఫ్టీ బిల్లులు సిద్ధమైనప్పుడే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులను కలిసి, నదులు, చెరువులపై హక్కులను కేంద్రం లాక్కునే కుట్రను వివరించా. అయినా ఒక్క సీఎం కూడా స్పందించలేదు. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రం నేతృత్వంలోని బోర్డులకు అప్పగిస్తూ గెజిట్‌ జారీ అయింది. నదులపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాలరాయడంలో భాగంగా వేసిన తొలి అడుగే ఇది. 

తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై?సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం. గోదావరి నదిని 200 కిలోమీటర్ల మేర పునరుజ్జీవనం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆనందం కలిగింది. హరితహారం కార్యక్రమంతో పాటు ఇంటింటికీ నీరిచ్చే మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ, ఆరుతడి పంటల సాగుకు తెలంగాణ ఇస్తున్న ప్రోత్సాహం వల్ల జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. మనిషిని, నీళ్లను జోడించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా వాటర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వాటర్‌ యూనివర్సిటీ లేదు. నీటి అవసరం, ప్రాధాన్యాన్ని భావితరాలకు అందించేలా పరిశోధనలు జరగాలి.

27 నుంచి నదులపై జాతీయ సదస్సు హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): నదులపై ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించనున్నామని వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్‌ తెలిపారు. భారతీయ ద్వీపకల్ప నదీ పరివాహక మండలి, భారతీయ హిమాలయ నదీ పరివాహక మండలి  సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో తెలంగాణ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్‌ సంస్థలు పాల్గొననున్నాయని ఆయన వెల్లడించారు. మంగళవారం జలసౌధలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏడేళ్లుగా జల వనరులపై కీలక పనులు జరుగుతున్నాయని, 200 కిలోమీటర్ల మేర గోదావరి నది పునరుజ్జీవనం జరిగిందని చెప్పారు. కాగా గెజిట్‌తో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గెజిట్‌ను వ్యతిరేకించాల్సిందేనని ఆయన అన్నారు. 

No comments:

Post a Comment