Monday 5 July 2021

Srisailam Hydel power project - Telangana ENC C Muralidhar

 జల విద్యుత్తు కోసమే శ్రీశైలం!

5 July 2021

ఆ ప్రాజెక్టు కట్టిందే అందుకు..

ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణలు నిరాధారం

నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టును కట్టిందే జల విద్యుత్తు కోసమని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 1959లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిందని గుర్తుచేసింది. ఈ ప్రాజెక్టులోని నీటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ లేఖ రాశారు. జూన్‌ 17నఏపీ ఫిర్యాదుకు  కేఆర్‌ఎంబీ స్పందించి తెలంగాణకు లేఖ రాయడంతో, దానికి ఈఎన్‌సీ ఈ మేరకు జవాబు ఇచ్చారు. లేఖలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్వాపరాలను వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమే నీటిని వినియోగించుకుంటున్నామని, ఏపీ అభ్యంతరాలు సరి కాద ని పేర్కొన్నారు.


లేఖలోని వివరాలు ఇవీ..

శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్తు కోసమే నిర్మించారని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1లోని 104వ పేజీలో కూడా ఉంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా శ్రీశైలం నీటిని ఇతర బేసిన్‌ లోకి తరలించలేదు. 1990-91 నుంచి 2019-20 దాకా ఏ నెలలోనూ 834 అడుగుల పైన శ్రీశైలం నీటిని నిల్వ చేసిన దాఖలాలు లేవు. 

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచి.. ఆ నీటిని ఇతర బేసిన్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తోంది. 2013 దాకా శ్రీశైలం లో 760 అడుగులకు చేరే వరకు కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని తరలించారు.

ఏపీ ప్రభుత్వానికి సాగర్‌, కృష్ణా డెల్టాల ప్రయోజనాలు అక్కర్లేదు. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పునకు విరుద్ధంగా ఈ నీటిని ఇతర బేసిన్‌ లకు తరలించే యత్నాలు చేస్తోంది. దీంతో సాగర్‌ పై ఆధారపడిన ప్రజలకు తీవ్ర నష్టం కలగనుంది.

2015 జూన్‌లో త్రిసభ్య కమిటీ సమావేశంతో పాటు బోర్డు 5, 7, 8, 12వ సమావేశాల్లో శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తి కోసం జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకారం కుదిరింది. దీనిప్రకారమే జల విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌ ప్రాజెక్టు అవసరాలు తీర్చుతున్నాం. 

జతెలుగుగంగ ప్రాజెక్టు, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను, ప్రధానం గా బేసిన్‌ అవతలి అవసరాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు శ్రీశైలంలో 880 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడే జలాలను తరలించాల్సి ఉం ది. శ్రీశైలం నికర జలాలను మిగులు జలాలపై కట్టి న ప్రాజెక్టులకు తరలించి, నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టాలకు నీటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

1976, 77ల్లో మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 15 టీఎంసీల కృష్ణా జలాలను చెన్నై తాగునీటి అవసరాలకు జూలై-అక్టోబరు మధ్య రోజుకు 1,500 క్యూసెక్కులకు మించి తరలించడానికి వీల్లేదు. 

శ్రీశైలం కుడికాలువ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) ప్రకారం కూడా చెన్నై తాగునీటి అవ సరాలకు 1,500 క్యూసెక్కులు, కుడికాలువకు 750 టీఎంసీ లు మాత్రమే తరలించాల్సి ఉంది. అది కూడా శ్రీశైలంలో 854 అడుగుల పైన ఉంటేనే తరలించాలి.

2019-20లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 170 టీఎంసీల నీటిని, 2020-21లో 124 టీఎంసీలను తరలించింది. అయితే 10 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటికి ఇవ్వలేకపోయామని చెప్పడం సరికాదు. పెన్నా బేసిన్‌లో 360 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు కట్టుకున్నారు. 

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గతేడాది 5 టీఎంసీలు తరలించారు. 

తెలంగాణ విద్యుదుత్పత్తి వల్ల ఏపీలో తాగునీటి కొరత అనే వాదనలో నిజం లేదు. కృష్ణా బేసిన్‌లో 629 టీఎంసీల నీటిని తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 12వ షెడ్యూల్‌లో సెక్షన్‌-1 ప్రకారం విద్యుత్కేంద్రాలు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. నిబంధనల మేరకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం. కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-1 తీర్పును అనుసరించి సాగర్‌లో నీటి నిల్వలను పెంచడానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. దీనిపై ఏపీ ఆరోపణలు నిరాధారం

No comments:

Post a Comment